పంపా తరగలపై పరమాత్ముని విహారం
● నేడే సత్యదేవుని తెప్పోత్సవం
● హంస వాహనంపై విహరించనున్న సత్యదేవుడు, అమ్మవారు
● వేలాది మంది తిలకించేలా ఏర్పాట్లు
అన్నవరం : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా పరమాత్మ స్వరూపుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల తెప్పోత్సవం పంపా తరగలపై బుధవారం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై.. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, కళ్లు మిరుమిట్లు కొలిపే బాణసంచా కాల్పుల నడుమ.. స్వామి, అమ్మవార్లు పంపా నదిలో విహరించే ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు.
విస్తృత ఏర్పాట్లు
తెప్పోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి సిద్ధం చేసిన పంటును ఇప్పటికే హంస వాహనంగా అందంగా ముస్తాబు చేశారు. దానిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. తెప్పోత్సవం నిర్వహించే పవర్ హౌస్ వద్ద ఉన్న పంపా తీరాన్ని కూడా సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్ రోడ్ ముఖ ద్వారం నుంచి పవర్ హౌస్ వరకూ కూడా రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. తెప్పోత్సవానికి హాజరు కావాల్సిందిగా ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు, దేవస్థానం చైర్మన్, ఈఓ, ఇతర వీఐపీలు ఈ కార్యక్రమాన్ని ఒడ్డు నుంచి తిలకించేలా పంపా నదీ తీరంలో వీఐపీ లాంజ్ ఏర్పాటు చేశారు. తెప్పోత్సవానికి వేలాదిగా వచ్చే భక్తుల కోసం 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, రెండు మోటార్ బోట్లను సిద్ధం చేశారు. మోటార్ బోట్లతో కూడా పంపా నదిలో ట్రయల్ రన్ నిర్వహించారు. తుని నుంచి అగ్నిమాపక శకటాన్ని కూడా తీసుకుని వచ్చి, సిద్ధంగా ఉంచుతున్నారు.
33 మందికి మాత్రమే అనుమతి
ఈసారి దేవస్థానం తరఫున 33 మందిని మాత్రమే తెప్ప మీదకు అనుమతించనున్నారు. వీరిలో ముగ్గురు దేవస్థానం వేద పండితులు, ప్రధానార్చకుడు, ఇద్దరు అర్చకస్వాములు, ఇద్దరు పరిచారకులు, ఇద్దరు సీనియర్ స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు, మంగళధ్వని కళాకారులు, పంటు ఆపరేటర్లు, దేవస్థానం విద్యుత్ విభాగ సిబ్బంది ఇద్దరు, పోలీసులు ఉంటారు. వీరందరూ విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలని నిబంధన పెట్టారు.
ఉత్సవం జరుగుతుందిలా..
స్వామి, అమ్మవార్లను సాయంత్రం 5 గంటలకు రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరానికి తీసుకుని వస్తారు. అక్కడి పూజా మండపంలో 5.30 గంటలకు తులసీధాత్రి పూజ ఘనంగా నిర్వహిస్తారు. అనంత రం సాయంత్రం 6 గంటలకు పంపా సరోవరంలో హంస వాహనంగా అలంకరించిన తెప్పపై ఏర్పాటు చేసిన రుద్రాక్ష మండపం మీద సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వేంచేయించి, పండితులు పూజలు చేస్తారు. తదనంతరం స్వామి, అమ్మవార్లను పంపా నదిలో మూడుసార్లు విహరింపజేస్తారు.
ఏర్పాట్లు పూర్తి
సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం తరువాత అన్నవరం దేవస్థానంలో అంతటి ప్రాధాన్యం కలిగినది తెప్పోత్సవం. దీనిని తిలకించేందుకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేశాం. భక్తులందరూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా పంపా నదీ తీరం వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేశాం. తెప్పోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తాం.
– కె.రామచంద్ర మోహన్, ఈఓ, అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment