కాకినాడ సిటీ: ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికీ హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని కలెక్టర్ షణ్మోహన్ స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని పలు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు, తరగతులకు హాజరు కానివ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా, పరీక్షలకు హాజరయ్యేందుకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కళాశాలలకు నేరుగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పాత బకాయిలు కూడా క్రమంగా చెల్లిస్తామని పేర్కొందన్నారు. ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలకు తెలియజేశామని కలెక్టర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment