వలంటీర్ల వ్యవస్థ లేదనడం సిగ్గు చేటు
● శాసన మండలిలో
మంత్రి ప్రకటన హాస్యాస్పదం
● వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు ధ్వజం
అమలాపురం టౌన్: వలంటీర్ల వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి అనడం సిగ్గు చేటని వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలు చేస్తామని హామీలు గుప్పించినప్పుడు మంత్రికి ఆ వ్యవస్థ ఉందని తెలీదా...? అని ప్రశ్నించారు. రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్, ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి వలంటీర్ల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు మాట్లాడారు. జిల్లా వలంటీర్ల అసోయేషన్ అధ్యక్షుడు కె.సత్తిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వలంటీర్ల మనుగడ, న్యాయ పోరాటం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. శాసనమండలి సాక్షిగా మంత్రి అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రాజేంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యంగా చంద్రబాబు పదే పదే ఇచ్చిన హామీల ప్రకారం వలంటీర్లను కొనసాగించి వారి గౌరవ వేతనాలను రూ.10 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 26 వేల మంది వలంటీర్లు ఆరు నెలలుగా వేతనాలు లేక, కొనసాగించక తీవ్ర అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో ఇదే అలక్ష్యం కొనసాగిస్తే న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment