రత్నగిరిపై భక్త ప్రభంజనం
అన్నవరం: కార్తిక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రత్నగిరికి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఒంటి గంట నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా భక్తజన సందోహంతో నిండిపోయింది. కార్తికంలో చివరి సోమవారం కావడంతో సత్యదేవుని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించిన అధికారులు ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరిచారు. పూజల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచే స్వామివారి వ్రతాలు కూడా ప్రారంభించారు. రికార్డు స్థాయిలో సత్యదేవుని వ్రతాలు 10,718 జరిగాయి. వీటిలో దాదాపు 70 శాతం రూ.300 టికెట్టుతో జరిగినవే. స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ, పాత కల్యాణ మండపాలు వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి అంతరాలయ దర్శనం టికెట్టు తీసుకున్న భక్తులను కూడా వెలుపలి నుంచే దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం, రావిచెట్టు, రామాలయం ధ్వజస్తంభం, జమ్మి చెట్ల వద్ద జ్యోతులు వెలిగించి దీపారాధన చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో నిండిపోయింది. సుమారు పది వేల మందికి పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 10 గంటల వరకూ ఈఓ కె.రామచంద్ర మోహన్ పశ్చిమ రాజగోపురం వద్దనే ఉండి, కంపార్టుమెంట్ల ద్వారా భక్తుల రాకపోకలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలిచ్చారు. వ్రత మండపాల వద్ద క్యూలను చైర్మన్ ఐవీ రోహిత్ పర్యవేక్షించారు.
1,22,496కు చేరిన సత్యదేవుని వ్రతాలు
ప్రస్తుత కార్తికంలో సత్యదేవుని వ్రతాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సోమవారం జరిగిన 10,718తో కలిపి ఇప్పటి వరకూ వ్రతాలు 1,22,496 జరిగాయి. 2023 కార్తికంలో నాలుగో సోమవారంతో కలిపి 97,743 మాత్రమే జరిగాయి. గత ఏడాది కార్తికంతో పోల్చితే ఈసారి 24,753 వ్రతాలు అధికంగా జరిగాయని అధికారులు తెలిపారు.
రూ.1.05 కోట్ల ఆదాయం
అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.05 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో వ్రతాల ద్వారానే సుమారు రూ.50 లక్షలు సమకూరింది. ప్రసాదం విక్రయాల ద్వారా రూ.45 లక్షలు, మిగిలిన విభాగాల ద్వారా రూ.10 లక్షల చొప్పున ఆదాయం వచ్చింది.
నేడు కూడా రద్దీ
కార్తిక బహుళ ఏకాదశి కావడంతో మంగళవారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ నెలకొనే అవకాశం ఉంది. సుమారు 60 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.
సత్యదేవుని దర్శించిన లక్ష మందికి పైగా భక్తులు
రికార్డు స్థాయిలో
10,718 వ్రతాల నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment