అన్నదమ్ముల సవాల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ ‘దేశం’లో అన్నదమ్ముల ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు అన్నీ తానై పార్టీని భుజాన మోసినందుకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్న సత్యనారాయణ వర్గం కారాలు మిరియాలూ నూరుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొన్నా, వెన్నంటి నిలవడమే తప్పు అన్నట్టుగా కనిపిస్తోందని వారు అంటున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అధికారం లేనప్పుడు కొండబాబు వెంట ఉన్న నాయకులు ఎవరు, అధికారం వచ్చాక ఉన్న నేతలు ఎవరో బేరీజు వేసుకోవాలంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నిన్న మొన్నటి వరకూ కొండబాబు కోసం అందరితో మాటలు పడ్డామనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోతున్నారని వైరి వర్గం గుర్రుగా ఉంది. గతంలో కూడా ఇలాగే ఒంటెద్దు పోకడలతో రాజకీయం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్న అనుభవాన్ని మరచిపోతే ఎలాగని వారు నిలదీస్తున్నారు. అయితే, గతంలో అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇంటా బయటా పార్టీ పెత్తనమంతా అప్పగిస్తే ఆ వర్గం చేసిన వ్యవహారాలు జనానికి తెలియంది కాదని కొండబాబు వర్గీయులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ముందు నుంచే..
అన్నదమ్ములైన సత్యనారాయణ, కొండబాబు మధ్య సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే విభేదాలకు బీజం పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం టీడీపీకా లేక జనసేనకా అనే మీమాంస మొదట ఎదురైంది. సీట్ల సిగపట్లు మొదలైనప్పటి నుంచీ అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేచింది. కొండబాబు తన సీటు కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నప్పుడే సత్యనారాయణ తన తనయుడు ఉమాశంకర్‌కు అవకాశం కోసం తెర వెనుక ప్రయత్నాలు జరపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కొండబాబు సహా కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా పరిగణించారని అప్పట్లో పార్టీలో విస్తృత చర్చే జరిగింది. ఒకవేళ సిటీ సెగ్మెంట్ టీడీపీకి కాకుండా జనసేన కోటాలోకి వెళ్లిపోతే తనయుడు ఉమ కోసం అక్కడ కూడా ఖర్చీఫ్ వేసేందుకు సత్యనారాయణ ప్రయత్నం చేశారు. ఈ విషయాలు ఆనోటా ఈనోటా తెలుసుకున్న కొండబాబు ఆగ్రహించారని, సోదరుడు సత్యనారాయణను, ఆయన ముఖ్య అనుచరులను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారని పార్టీ నేతల మధ్య బహిరంగంగానే చర్చ సాగింది. ఎన్నికలు దగ్గర పడటం, సీటు కొండబాబుకు ఖరారు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరింది. అందరూ కలసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సమస్యకు తెర పడిందని పార్టీ శ్రేణులు కూడా భావించాయి. వాస్తవానికి వీరి మధ్య పైకి రాజీ అయితే కుదిరింది కానీ అంతర్గతంగా ఉన్న విభేదాలకు మాత్రం తెర పడలేదు. ఈ అన్నదమ్ముల వర్గాల మధ్య తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అధికారం దక్కాక కొండబాబు వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తూండటంతో సత్యనారాయణ వర్గీయులు మండిపడుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిటీలో పలు విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించగా.. తాజాగా వాటి నుంచి దూరం పెట్టారు. దీంతో వీరి మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ఇది దేనికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది. టీడీపీలో అందరి నోటా ఇదే మాట బలంగా వినిపిస్తోంది.
తాడోపేడో తేల్చుకోవాలని..
నాడు అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్, పోర్టు, పోలీసు వ్యవహారాలను సత్యనారాయణకు అప్పగించారు. అయితే, దీనిని అవకాశంగా తీసుకుని, కొండబాబుకు నష్టం కలిగించేలా దందాలు సాగించారని ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఇంత జరిగాక మరోసారి ఎలా ఆ బాధ్యతలు అప్పగిస్తామని కొండబాబు వర్గం ప్రశ్నిస్తోంది. తాజాగా కూడా పోర్టులో పర్యవేక్షణ కార్యకలాపాలను పైకి అప్పగించినట్టే అప్పగించి.. తమ వర్గీయులు ఎవరు వచ్చినా పనులు చేయనవసరం లేదంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారని సత్యనారాయణ వర్గం కొండబాబుపై గుర్రుగా ఉంది. ఆయన తీరుతో విసుగెత్తిపోయిన సత్యనారాయణ వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతోంది. కుమారుడు ఉమను జనసేన పార్టీలో చేర్చడం ద్వారానే కొండబాబు వర్గానికి ముకుతాడు వేసే యోచనలో సత్యనారాయణ వర్గం ఎత్తులకు పై ఎత్తులు వేస్తోందని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
కాకినాడ ‘దేశం’లో అంతర్గత పోరు
ఎన్నికల తరువాత మారిన సీన్
తమ్ముడికి అన్నతో తలపోటు
Comments
Please login to add a commentAdd a comment