తప్పెవరిది?
మందుల్లో సైతం..
రోగ నిర్ధారణ అనంతరం వైద్యులు రాసే మందులను కూడా ఆయా ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మందుల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. చాలా మందులు బయట కొందామన్నా దొరకవు. వైద్యులు రాసిన మందులు కొన్న వెంటనే అక్కడి సిబ్బందికి చూపించాలి. కొన్ని రకాల మందులు ఆయా కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వైద్యుడు సూచించిన పేరుతో తయారవుతూంటాయి. అవి ఆ ఆసుపత్రిలో మాత్రమే లభ్యమవుతాయి. కొన్ని రకాల మందులు తరచుగా రాసే వైద్యులకు ఆయా కంపెనీలు భారీగా కానుకలు సమర్పిస్తూంటాయి.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్యో నారాయణో హరిః అంటూ వైద్యులను మనం అనాదిగా దేవుడితో సమానంగా భావిస్తాం. విధాత ప్రాణం పోస్తే.. వైద్యులు ఆ ప్రాణం నిలుపుతారనేది చాలామంది నమ్ముతారు. కానీ, ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఈ నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగులు మరణిస్తూండటం.. దీనికి వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రుల ధనదాహమే కారణమని ఆరోపిస్తూ వారి బంధువులు ఆందోళనలకు దిగడం కొద్ది రోజులుగా కనిపిస్తోంది. వారికి ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ఎంతో కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకుంటున్నాయి. దీనికి దారి తీస్తున్న కారణాలపై వైద్య వర్గాల్లో తప్పనిసరిగా చర్చ జరగాల్సిన అవసరముందని పలువురు అంటున్నారు.
ధనార్జనే పరమావధి
వైద్యం వ్యాపారంగా మారిన ప్రస్తుత కాలంలో సేవా దృక్పథంతో చికిత్స అందించే వైద్యులు చాలావరకూ కనుమరుగవుతున్నారు. వైద్య విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, పట్టా పొందిన వైద్యుల్లో కొంత మంది.. ఆ సొమ్ము, ఆసుపత్రి నిర్మాణ పెట్టుబడి తక్కువ వ్యవధిలోనే ఎలా రాబట్టుకోవాలనే దానిపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులను డబ్బు కోసం పీడిస్తున్నారనే అపవాదు వస్తోంది. మరోవైపు రోగుల ప్రాణాలను రక్షించుకునేందుకు వారి బంధువులు సాధ్యమైనంత వరకూ ఖర్చుకు వెనుకాడరు. వారి తపనే ఆసుపత్రులకు కాసులు కురిపిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి ప్రతి అడుగూ తమ కనుసన్నల్లోనే పడాలనే భావనతో అక్కడి సిబ్బంది ఉంటారు. ఓపీ చీటీ రాయించుకున్నప్పటి నుంచి రోగిని, వారి బంధువులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఓపీలో ఓపికగా వైద్యుని కోసం నిరీక్షించాలి. ఈలోగా వైద్యుడు బయటకు వస్తే రోగి సైతం వినయంతో లేచి నిలబడాలన్నట్టుగా సిబ్బంది వ్యవహార శైలి ఉంటుంది.
అవసరం లేకపోయినా పరీక్షలు!
ఓపీ అనంతరం వైద్యులు రాసే వైద్య పరీక్షలతో దోపిడీ మొదలవుతుంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లే రోగికి అవసరానికి మించి వైద్య పరీక్షలు చేయించి సొమ్ము చేసుకుంటున్నారన్న అపవాదు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై ఉంది. వైద్యుడు రాసిన రక్త పరీక్షలన్నీ ఆసుపత్రిలోని ల్యాబ్ లోనే చేయించాలని, బయట చేయిస్తే ఫలితాలు సక్రమంగా ఉండవని సిబ్బంది చెబుతూంటారు. కొంతమంది వైద్యులు అవసరం లేకపోయినా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, కలర్ డాప్లర్ వంటి ఖరీదైన టెస్టులు రాస్తూంటారనే ఆరోపణలున్నాయి. వీటిని బయట ఆధునిక పరికరాలున్న ప్రైవేటు ల్యాబ్‌లలో చేయించినా.. సిఫారసు చేసిన వైద్యుడికి ఆ ల్యాబ్ నుంచి 30 నుంచి 40 శాతం వరకూ కమీషన్ వెళ్లాల్సిందే. ఇదంతా లోపాయికారీ ఒప్పదం ప్రకారం జరిగిపోతూంటుంది. ఆసుపత్రికి రోగులను తీసుకువచ్చే గ్రామీణ వైద్యులకు కూడా రోగి చెల్లించిన బిల్లులో 20 శాతం తగ్గకుండా కమీషన్ ముట్టజెబుతారన్నది బహిరంగ రహస్యమే.
ప్రైవేటు ఆసుపత్రుల్లో
వరుస మరణాలు
రోగులను కాపాడటంపై శ్రద్ధ లేదని బాధితుల ఆగ్రహం
రూ.లక్షల్లో గుంజుతున్నారని ఆవేదన
అపోహలు సరికాదంటున్న వైద్య నిపుణులు
కోమాలో ఉన్నాడంటూ..
నిడదవోలులో ఇటీవల క్రిమిసంహారక మందు తాగి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం పేరుతో ఆ ఆసుపత్రి యాజమాన్యం రూ.40 వేలు కట్టించుకుంది. పరిస్థితి విషమించి ఆ బాలుడు కోమాలోకి వెళ్లడంతో రాజమహేంద్రవరంలోని ఎమర్జెన్సీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ రెండు రోజులు వైద్యం అందించిన వైద్యులు రూ.1.50 లక్షల వరకూ వసూలు చేశారు. అయినప్పటికీ బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. అతడి పరిస్థితి ఏమిటో వైద్యులు స్పష్టంగా చెప్పలేదు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ నుంచి భారీగా డబ్బులు గుంజారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment