బాలాత్రిపుర సుందరి సన్నిధిలో జస్టిస్ భవాని
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భవానీ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత రామలింగేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. జస్టిస్ భవానీకి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆలయ విశిష్టతను వివరించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని ఈఓ ఉండవల్లి వీర్రాజు అందజేశారు.
28న విధుశేఖర భారతీ
మహాస్వామి రాక
తుని రూరల్: శృంగేరీ జగద్గురు శంకరాచార్య సంస్థానం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి ఈ నెల 28న తాండవ కాశీ క్షేత్రమైన తపోవనానికి రానున్నారు. విజయ యాత్రలో భాగంగా వస్తున్న ఆయన తపోవనం ఆశ్రమంలో నిర్వహించనున్న సువర్ణ భారతీ వేద వేదాంత వేదభాష్య విద్వత్స గోష్టి, ధూళి పాదపూజ, మహాగణపతి, రుద్రయాగ పూర్ణాహుతి, మహా ప్రదోష నీరాజనంలో పాల్గొంటారు. తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. విద్వత్స గోష్టిలో దేశం నలుమూలల నుంచి 70 మంది ప్రధాన పండితులు పాల్గొంటారని చెప్పారు. భక్తులు పాల్గొని గురుదేవతా కృపకు పాత్రులు కావాలని కోరారు.
పీజీఆర్‌ఎస్‌కు 413 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజలు 413 సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, కేఎస్‌ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి, సీపీఓ పి.త్రినాథ్, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.రత్నమణి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాలు నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ల మంజూరు వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. వీటిని నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని
వ్యాప్తి చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): భారత రాజ్యాంగ స్ఫూరిని వ్యాప్తి చేసి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) జి.నాగమణి అన్నారు. జోన్–2 పరిధిలోని 7 జిల్లాల విద్యార్థులకు భారత రాజ్యాంగంపై వ్యాసరచన, క్విజ్ పోటీలను స్థానిక గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగమణి మాట్లాడుతూ, రాజ్యాంగం విశిష్టతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత విద్యార్థులపై ఉందన్నారు. డీవైఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా పౌరులు అనుసరించాలని సూచించారు. ఈ పోటీల్లో 105 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వీఎస్‌ఎన్ మూర్తి, బాలల సైన్స్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment