ఆయిల్‌పాం సాగుకు వెనుకంజ! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుకు వెనుకంజ!

Published Wed, Jan 29 2025 2:07 AM | Last Updated on Wed, Jan 29 2025 2:07 AM

-

నాగిరెడ్డిపేట: ఆయిల్‌పాం పంటను సాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నాలుగేళ్ల క్రితం అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో పలువురు రైతులు ఆ పంట సాగుకు ముందుకు వచ్చారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఈ పంటపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. కొత్తగా ఈ పంట సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు.

344 ఎకరాల్లోనే..

ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేయాలని ఉద్యాన శాఖ అధికా రులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. కానీ ఇప్పటివరకు 344 ఎకరాల్లోనే మొక్కలు నాటారు. లక్ష్యం చేరుకునేందుకు ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఆ లోగా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమనే భావిస్తున్నారు. ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 4,200 చొప్పున నాలుగేళ్లపాటు నిర్వహణ ఖర్చులను చెల్లిస్తారు. దీంతోపాటు డ్రిప్‌ సదుపాయం కోసం రాయితీపై పరికరాలను అందిస్తారు. అయినా కూడా ఆయిల్‌పాం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. అధికారులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం ఉండడం లేదు.

అవగాహన కల్పిస్తున్నాం

ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవ్వాలన్నది లక్ష్యం. సమయం తక్కువగా ఉన్నందున కనీసం వెయ్యి ఎకరాలలోనైనా ఆయిల్‌పాం మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తున్నాం.

– జ్యోతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, కామారెడ్డి

నాలుగేళ్లు వేచి ఉండలేక..

జిల్లాలో ఎక్కువగా వరి సాగవుతుంది. ఈ పంట నాలుగు నెలల్లోనే చేతికి వస్తుంది. ఆయిల్‌పాం దీర్ఘకాలిక పంట. నాలుగేళ్ల తర్వాత దిగుబడులు ప్రారంభమవుతాయి. పెట్టుబడి పెట్టి అంత కాలం ఎదురుచూసే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఈ పంట సాగుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గతంలో వేసిన ఆయిల్‌పాం పంట దిగుబడులు వచ్చే ఏడాదినుంచి అందనున్నాయి. ఆ దిగుబడులను చూసి రైతులకు పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు అవగాహన పెరిగితే జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఆసక్తి చూపని రైతులు

లక్ష్యానికి దూరంగానే సాగు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement