సిటీలో చెత్త కనిపించొద్దు | Sakshi
Sakshi News home page

సిటీలో చెత్త కనిపించొద్దు

Published Sun, May 26 2024 5:55 AM

సిటీలో చెత్త కనిపించొద్దు

● వారం రోజుల్లో పరిస్థితిలో మార్పురావాలి ● విధులను విస్మరిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు మెమో ● అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘వారం రోజుల్లోగా పారిశుధ్యం మెరుగు పడాలి...ఎక్కడా చెత్తాచెదారం కనిపించొద్దు..సిటీ క్లీన్‌గా మారాలి...లేదంటే చర్యలు తప్పవు’ అంటూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ హెచ్చరించారు. శనివారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో అధికారులు, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. రెండురోజుల క్రితం తాను పర్యటించిన సమయంలో నగరంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందన్నారు. అప్పుడు క్షేత్రస్థాయిలో లేని శానిటరీ ఇన్‌స్పెక్టర్లందరికీ మెమో జారీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించాలని, రోడ్లపై చెత్త కనిపించొద్దని ఆదేశించారు. రోడ్లపై చెత్తవేసే వారికి జరిమానా విధించాలన్నారు. మున్సిపల్‌ చెత్తను, హాస్పిటల్స్‌ వ్యర్థాలను కలవకుండా, హానికర చెత్తను సురక్షితంగా డిస్పోజ్‌ చేయాలన్నారు. వారంరోజుల్లోగా నగరం శుభ్రంగా ఉండాలని, ముందుగా మేజర్‌ డ్రైనేజీల్లో పూడిక తీయాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేశ్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ రాజమనోహర్‌, పర్యావరణ ఇంజినీర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement