గీసుకొండ(నర్సంపేట): వేములవాడ రాజన్న కోడెలను అమ్ముకున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గీసుకొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. శ్రీరాజరాజేశ్వర సొసైటీ పేరిట గోశాల నడుపుతున్న వెలగందుల రాజు, కాంగ్రెస్ నాయకుడు మాదాసి రాంబాబు ఈ నెల 1న వేములవాడ దేవస్థానం నుంచి లేగదూడలు తీసుకొని వచ్చి, కబేళాలకు తరలిస్తున్నారు. వారిపై విశ్వహిందూ పరిషత్‌తోపాటు పలువురు గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాంబాబును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతడితోపాటు అనంతారం గ్రామానికి చెందిన మంద స్వామి, దుగ్గొండి మండలం చలపర్తి (ప్రస్తుతం అనంతారం నివాసి)కి చెందిన పశునూని శ్యాంసుందర్ కలిసి వారి కుటుంబ సభ్యులతోపాటు గీసుకొండ, దుగ్గొండి మండలంలో తెలిసిన రైతుల నుంచి ఆధార్‌కార్డులు, భూమి పత్రాలను సేకరించారు. అనంతరం వేములవాడ గోశాలకు వెళ్లి అక్కడి దేవాలయ అధికారుల సహకారంతో రైతుల సంతకాలు పెట్టారు. రెండు విడతలుగా 66 కోడెలను గీసుకొండ మండలం గట్టుకిందిపల్లిలోని మాదాసి రాంబాబు కౌలుకు తీసుకొని, వ్యవసాయం చేస్తున్న భూమి పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించారు. వాటిలో 28 కోడెలను అమ్ముకోగా మరో 26 కోడెలను వేములవాడ గోశాలకు తిరిగి అప్పగించారు. అలాగే, మూడు కోడెలు చనిపోగా, మిగిలిన మరో 9 కోడెలను స్వాధీనం చే సుకున్నామని, దీనికి బాధ్యులైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుల ఫొటోలు కావాలని పోలీసులను విలేకరులు కోరగా.. ఆయన స్పందించలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాంబాబుతోపాటు మరో ఇద్దరి రిమాండ్
రైతుల పేరిట సంతకాలు పెట్టి కోడెలను తీసుకువెళ్లారు..
వివరాలు వెల్లడించిన
గీసుకొండ సీఐ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment