మాకేది భరోసా!
● విలీన గ్రామాల కూలీలపై స్పష్టత కరువు ● ఏళ్లుగా ‘ఉపాధి’కి దూరం ● సింహభాగం భూమి లేని కూలీలే
కరీంనగర్ అర్బన్:
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు చక్కని ఉపాధి వేదిక. ఏ కాలంలోనైనా పనులు కల్పించడం దీని ప్రత్యేకత. కొన్నాళ్లుగా ఉపాధి పనుల లేమి, అందని వేసవి భత్యం నీడలా వెంటాడుతున్నాయి. విలీన గ్రామాల్లో ఉపాధి పనులు లేక పనులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. మునిసిపాలిటీల్లో కలిసి తమ గ్రామం హోదా పెరిగిందని సంతోషించాలో, పనుల్లేక పస్తులుండటంపై రోదించాలో తెలియని అయోమయ పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏటా రూ.12వేలు ఇచ్చేందుకు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. భూమి లేని ఉపాధి కూలీలను అర్హులుగా తేల్చగా విలీన గ్రామాల కూలీలపై స్పష్టత కరువైంది. ఇప్పటికే ఉపాధి పథకంపై నీలినీడలు కమ్ముకోగా ఆత్మీయ భరోసానైనా అందించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
విలీన గ్రామాల్లో పనులేవీ?
జిల్లాల పునర్విభజన, మునిసిపాలిటీల అప్‌గ్రేడేషన్‌తో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. జిల్లాలో చాలా గ్రామాలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో చేరాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో 18గ్రామాలకు పైగా విలీనం చేశారు. అలాగే హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మునిసిపాలిటీల్లో 20కిపైగా గ్రామాలను కలిపారు. ప్రస్తుతం సదరు గ్రామాలు పంచాయతీ పాలకవర్గం నుంచి మునిసిపాలిటీలో వార్డులుగా మారగా ఉపాధి పథకం దూరమైంది. ఆయా గ్రామాల్లో సుమారు 9వేల మందికి పైగా కూలీలుండగా ఉపాధి పనులు లేక ఇతర ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని ప్రజాప్రతినిధులు వినతులు సమర్పిస్తున్నా ఆచరణలో అమలుకావడం లేదు.
ఉపాధికి వెళ్తేనే ఆత్మీయ భరోసా
ఇటీవల గ్రామాల వారీగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ లబ్ధిదారుల ఎంపిక విషయమై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అర్హులకు దక్కకుండా అనర్హుల పేర్లు వచ్చాయని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకానికి అర్హులను గుర్తించడానికి జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో ఉపాధి కూలీల వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయగా జిల్లాలో 16,565 మంది భూమి లేని ఉపాధి కూలీలు ఉన్నారని తేల్చారు. తొలి విడతలో ప్రభుత్వం రూ.6 వేలు కూలీల ఖాతాల్లో జమ చేయసుంది.
లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందంటే..
జిల్లావ్యాప్తంగా ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగానే ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి పథకం పనులకు వెళ్తుంటారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో 20 రోజుల ఉపాధి పథకం పనులకు వెళ్లిన వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆధార్ కార్డు అనుసంధానం కాని వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. జాబ్‌కార్డుతో ఆధార్ నంబరు లింక్ కానటువంటి ఉపాధి కూలీల ఆధార్, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఫోన్ నంబర్లతో పాటు లబ్ధిదారుల్లో ఎవరైనా మరణించినవారుంటే వారి వివరాలు తొలగించి ఆన్‌లైన్ నమోదు పూర్తి చేస్తున్నట్లుగా అధికారవర్గాలు వెల్లడించాయి. వీరికి ఒక్కగుంట కూడా సాగు భూమి ఉండకూడదు. ఇదిలాఉండగా విలీన గ్రామాల ఉపాధి కూలీల విషయంలో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో..
గ్రామాలు 313
కూలీ కుటుంబాలు 1,55,738
కూలీలు 3,28,917
శ్రమశక్తి బృందాలు 9,936
భూమి లేని ఉపాధి కూలీలు 16,565
విలీన గ్రామాల్లో భూమిలేని కూలీలు 8,500 (అంచనా)
విలీన గ్రామాలివే..
కరీంనగర్ కార్పొరేషన్: చింతకుంట, లక్ష్మీపూర్, మల్కాపూర్, బొమ్మకల్, గోపాల్‌పూర్, దుర్శేడ్, కొత్తపల్లి
హుజూరాబాద్: ఇప్పల్‌నర్సింగపూర్, బోర్నపల్లి, కొత్తపల్లి, దమ్మక్కపేట
జమ్మికుంట: రామన్నపల్లి, కొత్తపల్లి, ధర్మారం
Comments
Please login to add a commentAdd a comment