సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత సంచారం
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో అనేక చోట్ల చిరుత సంచారం ఎక్కువవుతోంది. తాజాగా బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకా పరిధి ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో ఉన్న హూస్కురు, గట్టహళ్లి గ్రామాల మధ్య శుక్రవారం చిరుత కనిపించింది. హుస్కూరుకు చెందిన చంద్రు అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా రోడ్డు మధ్యలో చిరుత వెళ్లడం కనిపించింది. దీంతో భయంతో కొద్ది దూరం వెనక్కు వెళ్లాడు. బైక్ వెలుతురు రావడంతో చిరుత వేగంగా పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా చిరుత సంచారం బయటపడింది. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు నుంచి అయోధ్యకు విమాన సేవలు
దొడ్డబళ్లాపురం: వచ్చే జనవరి 17 నుంచి ఎయిర్ ఇండియా సంస్థ బెంగళూరు నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు అందించనుంది. జనవరి 17న ఉదయం 8.05కి బెంగళూరు నుండి అయోధ్యకు మొదటి విమానం ఎగరనుంది 10.35కి అయోధ్య చేరుకోనుంది. మళ్లీ అయోధ్య నుండి 3.40కి బయలుదేరి సాయంత్రం 6.10కి బెంగళూరు చేరుకోనుంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభించబడ్డాక అయోధ్యకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సంస్థ అధికారులు చెప్పారు.
అటవీ సిబ్బంది సస్పెండ్
దొడ్డబళ్లాపురం: హాసన్ తాలూకా నందగొండనహళ్లిలో 12 ఎకరాల అటవీ ప్రదేశంలో పెరిగిన చెట్లను నరికివేసిన సంఘటనలో మొత్తం 5 మంది అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ నెల 16న కొందరు చెట్లను నరికివేసినట్లు బేళూరు తహసీల్దార్ మమతకు తెలిసింది. ఎంపీ ప్రతాప్ సింహ అండతో చెట్లు కొట్టేశారని ఆరోపణలు వచ్చాయి. ఎంపీ తమ్ముడు విక్రం సింహ అల్లం పంట సాగు కోసం నందగొండనహళ్లిలో జయమ్మ అనే మహిళకు చెందిన మూడు ఎకరాల పొలాన్ని గుత్తకు తీసుకున్నాడు. తరువాత పక్కనే 12 ఎకరాల గోమాళ భూమిలో ఉన్న చెట్లను నరికివేయించాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం స్పందించిన ఇందులో నిర్లక్ష్యం వహించారని అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ కుమార్‌తో సహా ఐదుమంది అటవీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.
పైపులు పగిలి రోడ్లు అధ్వాన్నం
బాగేపల్లి: బాగేపల్లి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటకలను కలిపే ప్రముఖ స్థలంలో ఉంటుంది, కానీ కనీస వసతుల కల్పనలో వెనుకబడిపోయింది. పట్టణంలోని గోళూరు రోడ్డులో పురసభ పరిధిలో తాగునీటి పైప్‌లైన్ పగిలి నీరు రోడ్లపై పారుతోంది. సుమారు 20 రోజుల నుంచి నీరు మొత్తం రోడ్లపైకి వస్తోంది. బురద, గుంతలు తేలి ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద వెళ్లడానికి వీలు కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పురసభ అధికారులు ఇటు వైపు వచ్చి చూసింది లేదని వాపోయారు. పైపులను, రోడ్లను ఎప్పటికి బాగుచేస్తారని ప్రశ్నించారు.
నకిలీ పోలీస్‌కు సంకెళ్లు
మైసూరు: క్రైం బ్రాంచ్ పోలీస్ అని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా బైలుకొప్ప పోలీసులు అరెస్టు చేశారు. కేఆర్ నగర తాలూకాలోని మదువనహళ్ళికి చెందిన దివ్యరాజ్ అనే వ్యక్తి పోలీస్‌నని ప్రజలను భయపెడుతూ డబ్బులు గుంజుతున్నాడు. కొప్ప గ్రామంలొ ఉన్న ఆయుర్వేదిక్ స్పా యజమానికి పుష్పకుమార్‌ను కూడా ఇలాగే చెప్పి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అతడు అనుమానంతో బైళుకొప్ప పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దివ్యరాజ్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment