నేడే మలివిడత ఎన్నికలు | Sakshi
Sakshi News home page

నేడే మలివిడత ఎన్నికలు

Published Tue, May 7 2024 3:55 AM

నేడే

సాక్షి,బళ్లారి: నెల రోజులకు పైగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో హోరెత్తించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు నానా తంటాలు పడిన నేపథ్యంలో ఓటరు దేవుళ్లు తమ ఓటు ద్వారా అభ్యర్థుల భవితవ్యంపై నేడు తీర్పు ఇవ్వనున్నారు. ఐదేళ్ల పాటు పాలకులు రారాజులుగా వెలిగితే, ఆ పాలకులను చేసేందుకు ఓటరుకు ఒక రోజు రారాజుగా అవకాశం దక్కనుంది. అది ఎన్నికల పోలింగ్‌ రోజున మాత్రమే. ఈ క్రమంలో మంగళవారం కర్ణాటకలో మలివిడత రెండో దశలో 14 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో బళ్లారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు కూడా సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి జిల్లాధికారి, జిల్లాఽ ఎన్నికల అధికారి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు నియమించిన సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ సామగ్రితో బస్సుల్లో తరలివెళ్లారు.

మొత్తం ఓటర్లు 18.84 లక్షలు

బళ్లారి లోక్‌సభ పరిధిలో బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ, కంప్లి, సండూరు, కూడ్లిగి, విజయనగర, హగరిబొమ్మనహళ్లి, హడగలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18,84,469 మంది ఓటర్లు ఉండగా, ఇందుకు గాను 1972 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇప్పించడంతో పాటు ఈవీఎంలు, ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని తీసుకుని బయలుదేరి వెళ్లారు. పోలింగ్‌ సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పంపించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లే సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారితో పాటు పలువురు ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్‌ నిర్వహణలో మస్టరింగ్‌పై దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది చూసుకునే విధంగా పకడ్బందీగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను చేతపట్టుకుని అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, మహిళా పోలింగ్‌ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వేలాది మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికలకు తరలివెళ్లడంతో మస్టరింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు, పోలీసుల సందడి కనిపించింది.

5952 మంది పోలింగ్‌ సిబ్బంది

లోక్‌సభ పరిధిలోని మొత్తం పోలింగ్‌ కేంద్రాలకు గాను 5952 మంది పోలింగ్‌ సిబ్బంది, 2148 పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 42 మంది ఎస్‌ఐలు, 69 మంది ఏఎస్‌ఐలు, 557 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 656 మంది పోలీసులు, 792 మంది హోంగార్డులు జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తగిన శిక్షణ తీసుకుని ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర, మధ్య కర్ణాటక పరిధిలోని బాగల్‌కోటె, బీదర్‌, హావేరి, దావణగెరె, రాయచూరు, కలబుర్గి, విజయపుర, కొప్పళ, ధారవాడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, బెళగావి, చిక్కోడి తదితర 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో 2,59,17,193 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పోలీసు అధికారులు ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లే ముందు దిశానిర్దేశం చేసి, ఈవీఎంలు, పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించే ఎన్నికల సామగ్రిని అప్పగించి పోలింగ్‌ కేంద్రాలు పంపించారు. మంగళవారం జరగనున్న 14 లోక్‌సభ నియోజకవర్గాలతో కలిపి కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

ప్రజాస్వామ్య ఓట్ల పండుగ నేడే

హుబ్లీ: ఆసక్తికరంగా మారిన ధార్వాడ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు చర్యలతో పాటు ఈవీఎం సంబంధిత యంత్రాల తరలింపు సోమవారం సాయంత్రం చురుగ్గా సాగింది. కాగా మొత్తం లోక్‌సభ ఎన్నికల్లో 18,31,975 ఓటర్లు ఉండగా, ఇందుకోసం 4 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. 4 టీఏపీఎఫ్‌ బృందాలను 76 ఫ్లాటూన్‌లుగా విభజించినట్లు ధార్వాడ హుబ్లీ జంటనగరాల పోలీస్‌ కమిషనర్‌ రేణుకా సుకుమార తెలిపారు. కేఎస్‌ఆర్‌పీ, సీఏఆర్‌ బృందాలతో పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులను నియమించారు. ఇప్పటి వరకు 21 మందిని సంఘవిద్రోహశక్తులుగా భావించి సరిహద్దుల నుంచి బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 12 మందిని సరిహద్దు నుంచి బహిష్కరించినట్లు ప్రశాంతంగా పోలింగ్‌నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గోపాల్‌ బ్యాకోడ్‌ తెలిపారు. మొత్తం ధార్వాడ లోక్‌సభ పరిధిలో 8 అసెంబ్లీ క్షేత్రాలు వీటిలో 7 జిల్లా పరిధిలో ఉండగ మరొకటి హావేరి జిల్లా శిగ్గాంవి అసెంబ్లీ స్థానం కూడా ఈ పరిధిలోకే వస్తుంది.

రూ.20.37 కోట్ల నగదు సీజ్‌

కాగా ఇప్పటి వరకు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి రూ.20,37,02,970 జప్తు చేయగా 1468 కేసులు నమోదు చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లాధికారిణి దివ్యప్రభు తెలిపారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లను ఆమెతో పాటు పోలీస్‌ కమిషనర్‌ రేణుకా సుకుమార, జెడ్పీ సీఈఓ స్వరూప, జిల్లా ఎస్పీ గోపాల బ్యాకోడ్‌ దగ్గర ఉండి అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు.

పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలతో

తరలిన సిబ్బంది

14 లోక్‌సభ నియోజకవర్గాలకు

రెండో దశ పోరుకు అన్ని ఏర్పాట్లు

నేడే మలివిడత ఎన్నికలు
1/4

నేడే మలివిడత ఎన్నికలు

నేడే మలివిడత ఎన్నికలు
2/4

నేడే మలివిడత ఎన్నికలు

నేడే మలివిడత ఎన్నికలు
3/4

నేడే మలివిడత ఎన్నికలు

నేడే మలివిడత ఎన్నికలు
4/4

నేడే మలివిడత ఎన్నికలు

 
Advertisement
 
Advertisement