శివాజీనగర: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) ఇంటి స్థలాల స్వీకారంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గెహ్లాట్ అనుమతినివ్వడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం కోర్టును ఆశ్రయించనున్నారు. గవర్నర్ ఆదేశాలపై స్టే, లేదా కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ సమర్పించనున్నారు. కాంగ్రెస్ నేతలు, సీనియర్ వకీళ్లు అయిన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ నుంచి ఆదివారం బెంగళూరుకు వచ్చారు.
వీరిద్దరితో సిద్దరామయ్య న్యాయ పోరాటం గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం సైతం సిద్దరామయ్యకు అండగా ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ముడా కేసును, ఫిర్యాదిదారుల లేఖలను, ప్రాసిక్యూషన్ ఆదేశాలను లోతుగా అధ్యయనం చేసి ఎలా ముందుకెళ్లాలనేది సిబాల్, సింఘ్విలు మంతనాలు జరిపారు. రాష్ట్రానికి చెందిన రాజ్యాంగ, న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాక ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.
ప్రజా ప్రతినిధుల కోర్టులో..
ముడా కేసులో సిద్దరామయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 20న జడ్జి ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. అంతలోపే తమ విన్నపాలను ఆలకించాలని సిద్దరామయ్య సోమవారం మధ్యంతర పిటిషన్ సమర్పించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహాం కోర్టులో సీఎంపై ప్రైవేట్ కేసు వేసి ఎఫ్‌ఐఆర్ నమోదుకు విజ్ఞప్తి చేశారు.
అన్ని జిల్లాల్లో ధర్నాలు: డీసీఎం
కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. సోమవారం అన్ని జిల్లాల్లో బీజేపీ, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు జరుపనున్నారు. మైసూర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయాలను తెలిపారు. ప్రతి జిల్లాలో ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోంది. వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాత్మాగాంధీ బాటలో అహింసా పద్ధతిలోనే మా పోరాటం జరుగుతుంది అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment