ఉవ్వెత్తున ఉత్సవ హేల
మైసూరు: దసరా ఉత్సవాలతో మైసూరు శోభాయమానంగా విలసిల్లుతోంది. ఉత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. ఫలపుష్ప ప్రదర్శన, చలనచిత్రోత్సవం, ఆహార మేళా, నృత్య గాన వేడుకలు, యువ దసరా, విద్యుత్ దీపాలంకరణ వీక్షణకు ఇరుగు పొరుగు జిల్లాలు, బయటి రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న పర్యాటకులతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వేలాదిగా భక్తులు చాముండికొండకు రావడం వల్ల కిక్కిరిసిపోతోంది.
కొండపై యోగాచరణ
బుధవారం యోగా దసరా ఉప సమితి ఆధ్వర్యంలో నగరంలోని చాముండి కొండపై యోగాభ్యాసం చేశారు. ఉదయం 7 గంటలకు వయోభేదం లేకుండా యోగా సాధకులు చేరుకున్నారు. యోగాసనాలు, దుర్గా నమస్కారం, సూర్య నమస్కారం తదితరాలను ఆచరించారు. మధ్యలో కళాకారుల కళా ప్రదర్శనలు అలరించాయి.
యదువీర్ సరస్వతీ పూజ
అంబావిలాస్ ప్యాలెస్‌లో రాజవంశస్తులు, ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ బుధవారం సరస్వతి పూజ నిర్వహించారు. వీణ, వేదశాస్త్రాల పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలకు పూజలు చేశారు. ప్యాలెస్ ముందు పోలీసులు, ఏనుగులతో జంబూ సవారీ రిహార్సల్స్ చేశారు.
బిందాస్ బాలీవుడ్ నైట్స్
ఉత్తనహళ్లిలో యువ దసరాలో యువత ఉత్సాహం మిన్నంటుతోంది. బాలీవుడ్ నైట్ గానకచేరీకి పోటెత్తారు. కళాకారుల సినీ గీతాలాపన, రమణీయంగా నృత్యాలు రంజింపజేశాయి. బాలీవుడ్ గాయకుల పాటలు, డీజే బీట్స్‌తో ర్యాప్ పాటలకు యువత చిందులేశారు.
ప్యాలెస్ ముందు కవాతు రిహార్సల్స్
మైసూరు దసరాకు జన వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment