విషాదం వెనుక తల్లి!
కుటుంబం
బొమ్మనహళ్లి: కన్న తల్లి ధనాశ, సతాయింపులకు కొడుకు కుటుంబం బలైంది. పచ్చని సంసారంలో తల్లి కుయుక్తులతోనిప్పులు పోసింది. కార్తీక్ భట్ అనే యువకుడు.. భార్య ప్రియాంక, చిన్నారి కొడుకు హృదయ్‌ను హత్య చేసి, తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసులో మంగళూరులోని ముల్కి పోలీసులు.. కార్తీక్ భట్ తల్లి శ్యామల, అక్క కణ్మని ని అరెస్టు చేశారు. ఐదు రోజుల కిందట ఈ హత్యలు, ఆత్మహత్య జరగడం తెలిసిందే.
విదేశాల నుంచి తిరిగొస్తే..
వివరాలు.. 2018లో ఉడుపిలో కార్తీక్ భట్– ప్రియాంకకు వైభవంగా పెళ్లయింది. కార్తీక్ కొన్నాళ్లు విదేశాలలో ఉద్యోగం చేసి మంగళూరు దగ్గర పక్షికెరెకి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. కార్తీక్ ఇచ్చిన డబ్బులతో తల్లిదండ్రులు పెద్ద ఇంటిని కొనుగోలు చేశారు. ఆ అప్పును కార్తీక్ ఇంకా చెల్లిస్తున్నాడు. తల్లి శ్యామల.. ఈ ఇల్లు తన కుమార్తె కన్మనిదని అందరికీ చెప్పడంతో పాటు కార్తీక్‌ను చిన్నచూపు చూసేవారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని కొడుకు, కోడలిని ఆమె సతాయించేది. కోడలిని వారి ఇంటిలో వదిలేసి, నువ్వు మళ్లీ విదేశాలకు వెళ్లి డబ్బు పంపాలని ఒత్తిడి చేసేది. కానీ కార్తీక్‌కు ఇది ఇష్టం లేకపోయింది. గత రెండేళ్ల నుంచి కార్తీక్ కుటుంబం మరో గదిలో వేరుగా ఉంటోంది. చివరికి తల్లి వేధింపుల విరక్తి చెంది ఈ నెల 9న భార్య, కొడుకును గొంతు పిసికి చంపిన కార్తీక్, దూరంగా రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సంతోషంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా కడతేరిపోయింది. వారి చావుకు కార్తీక్ తల్లి, సోదరి కారణమని ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment