ఈ– ఆస్తికి లంచాల గోల
శివమొగ్గ: పాలికెలో ఈ–ఆస్తి ప్రమాణపత్రం అందించేందుకు సిబ్బంది విపరీతంగా లంచాలు గుంజుతున్నారని బుధవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయంలో ధర్నాచేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థిరాస్తి నమోదు, బ్యాంకుల్లో రుణాలకు అన్ని రకాల పనులకు నగర, పట్టణ పంచాయతీల్లో ఈ–ఆస్తి ప్రమాణ పత్రాన్ని కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. దీంతో ప్రజలు ఆ ధృవపత్రం కోసం పాలికె చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. పత్రం మంజూరుకు రెవెన్యూ విభాగం ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. జిల్లాధికారి పాలికెను తనిఖీ చేసి లంచగొండి సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. ఈ మేరకు జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు.
బైక్ ప్రమాదంలో
రిజర్వు పోలీసు మృతి
బనశంకరి: గూడ్స్ వాహనాన్ని బైక్ ఢీకొన్న దుర్ఘటనలో రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన నగరంలో బ్యాటరాయనపుర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రిజర్వు పోలీసు సీబీ మను (27) మంగళవారం రాత్రి నాగరబావి నుంచి నాయండహళ్లి మార్గంలో బైకులో వెళుతున్నాడు. రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ జారి గూడ్స్ వాహనాన్ని డీకొంది. ఈ ప్రమాదంలో మను తల, ఇతర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతర వాహనదారుల సాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. 2019 బ్యాచ్ కు చెందిన మను సోమవారమే పుట్టినరోజు జరుపుకున్నాడని సహ ఉద్యోగులు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మైసూరు: మైసూరు జిల్లాలో అప్పుల భూతానికి మరో రైతు బలయ్యాడు. రైతన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పిరియాపట్టణ తాలూకా లక్ష్మీపుర గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన స్వామిగౌడ (45) ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.40 వేలు, కర్ణాటక గ్రామీణ బ్యాంకులో రూ.6 లక్షలు, వివిధ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.5 లక్షల మేరకు అప్పులు చేశాడు. పంటలు పండక, వాటిని తీర్చలేక విరక్తి చెంది ప్రాణాలు చేసుకున్నాడు. పిరియాపట్టణ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
హాస్టల్‌లో చద్దన్నం..
50 మందికి అస్వస్థత
దొడ్డబళ్లాపురం: రాత్రి మిగిలిన అన్నం తిని 50 మందిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బీదర్ జిల్లా హుమనాబాద్‌లో చోటుచేసుకుంది. హుమనాబాద్‌లోని బసవతీర్థ విద్యాపీఠ వసతి పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. హాస్టల్ సిబ్బంది రాత్రి మిగిలిన చద్దన్నానికి తిరగవాత వేసి పిల్లలకు వడ్డించారు. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అన్నం పాచిపోయి ఉండడమే కారణమని అనుమానాలున్నాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎంఎల్‌సీ భీమరావ్ విద్యార్థులను పరామర్శించారు.
చెన్నపట్టణలో
రూ.29 కోట్ల మద్యం సీజ్
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణలో ఉప ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఇప్పటివరకూ ఎకై ్సజ్ శాఖ అధికారులు రూ.29 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్ని పార్టీలు ఓటర్లకు పంచడానికి పోటాపోటీ పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మద్యం తెప్పించాయి. ఈ సమయంలో పలుచోట్ల మద్యం పట్టుబడింది. తాలూకాలో అనుమతులు లేకుండా మద్యం నిల్వ చేయడం, తగిన దాఖలాలు లేకుండా మద్యం తరలించడం లాంటి 151 కేసులు నమోదు చేసి రూ.29 కోట్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment