నకిలీ ఈఎస్‌ఐ కార్డు ముఠాకు సంకెళ్లు
బనశంకరి: నకిలీ కంపెనీలు సృష్టించి వాటి ద్వారా అర్హతలేని 869 మందికి ఈఎస్‌ఐ కార్డులు తయారుచేసి ఈఎస్‌ఐ వైద్యశాలలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు నష్టం చేకూరుస్తున్న ముఠాని మంగళవారం నగర సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. రాజాజీనగర ఈఎస్‌ఐ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు శ్రీధర్, రమేశ్ శివగంగ, శ్వేత, ఆడిటర్ శశికళ అనేవారు నిందితులు.
రూ. 20 వేలిస్తే కార్డు
పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ముఠా నుంచి పెహచాన్ కార్డుల తయారీకి వాడే నకిలీ కంపెనీల సీళ్లు, వైద్యుల సీళ్లు, 4 ల్యాప్‌టాప్‌లు, రూ.59 వేల నగదు తదితరాలను సీజ్ చేశామన్నారు. లేని కంపెనీలు ఉన్నట్లు చూపి అందులో ఉద్యోగులని చెప్పి కోరినవారికి కార్డులను జారీ చేసేవారు. కార్డు లేని రోగులతో మాట్లాడి రూ.20 వేలకు పైగా నగదు వసూలు చేసి ఈఎస్‌ఐ కార్డుల్ని ఇచ్చేవారు. వాటిని చూపి ఉచితంగా వైద్యం పొందే వెసులుబాటు ఉంటుంది. కార్డుదారుల నుంచి ప్రతి నెలా రూ.500 నగదు తీసుకుని ఈఎస్‌ఐ అకౌంట్‌కు రూ.280 నగదు చెల్లించి మిగిలిన రూ.220 స్వాహా చేసేవారు.
వందలాది మంది నకిలీ ఉద్యోగులు వైద్యం చేయించుకోగా, ఆ బిల్లు సర్కారు ఖాతాలో పడేది. ఫలితంగా ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ఈఎస్‌ఐ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు శ్రీధర్ ఇందులో ముఖ్యపాత్ర పోషించాడు.
కార్డులతో ఉచిత కార్పొరేట్ వైద్యం
సర్కారుకు భారీ నష్టం
Comments
Please login to add a commentAdd a comment