తల్లీ కూతురు ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: భర్త మృతితో తీవ్ర మనోవేదనకు భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. వరుస మరణాలతో కుటుంబమే కడతేరిపోయింది. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా చిక్కందవాడి గ్రామంలో జరిగిన ఈ విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గీత (45), ఆమె కూతురు లావణ్య (17) కలిసి ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ బిడ్డ ఉరికి వేలాడుతూ కనిపించారు. అప్పటికే మూడు నాలుగు రోజులై ఉండడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. చిక్కజాజూరు పోలీసులు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ఆరు నెలల క్రితం గీత భర్త, రైతు బసవరాజు గుండెపోటుతో మరణించాడు. అప్పటినుంచి తల్లీకూతురు ఆయనను తలచుకుని తీవ్ర ఆవేదన చెందేవారని, ఈ నేపథ్యంలో వారిద్దరూ ఆత్మహత్య చేసుకొన్నట్లు స్థానికులు చెప్పారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment