గ్రామంలో పులి అలజడి
మైసూరు: ఆవుపై పులి దాడి చేసి చంపి తిన్న ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా బండీపుర పులుల అభయారణ్యంలో నాగణాపురలో జరిగింది. గ్రామ పరిసరాల్లో తరచుగా ఓ పులి కనిపిస్తుండేది. ఓ గ్రామస్తునికి చెందిన ఆవును చంపి కొంతమేర ఆరగించింది. గత ఏడాది ఇదే చోట పులి ఓ మహిళను చంపివేసింది. ఇప్పుడు మళ్లీ ఆ పులి కనిపించడం గ్రామస్తుల్లో కలవరానికి కారణమైంది. గ్రామానికి వచ్చిన అటవీ అధికారితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మీకు పులిని అడవిలోకి తరిమేయడం సాధ్యం కాకుంటే చెప్పండి, మేమే పులిని తరుముతాం, పులి దాడిలో ఎవరైనా చనిపోతే వచ్చి సంతాపం తెలిపేది వద్దు, పరిహారం వద్దు. మీరు పులి గురించి చదువుకున్నారు. మేము అనుభవిస్తున్నాము అని భగ్గుమన్నారు. గత ఏడాది పులి దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఇప్పుడు ఆవు బలి అయింది అని యువకులు మండిపడ్డారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతపరిచిన అటవీ అధికారులు పులి కోసం బోనులు పెడతామని తెలిపారు.
రూ. 75 లక్షల దోపిడీ..
అంతా నాటకం
దొడ్డబళ్లాపురం: ఈ నెల 15న బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా హరగాపుర హైవే పై కారులో వస్తున్న కేరళ బంగారం వ్యాపారిని ఇద్దరు దుండగులు రివాల్వర్‌తో బెదిరించి కారు, అందులోని రూ.75 లక్షలతో పరారైన సంగతి తెలిసిందే. సంకేశ్వర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అసలు దొంగను కనిపెట్టారు. బంగారం వ్యాపారే ఈ నాటకానికి సూత్రధారి అని తేల్చారు. పోలీసులకు నెర్లి గ్రామం వద్ద దొంగలు వదిలి వెళ్లిన కారు లభించింది. కారులో రహస్యంగా హ్యాండ్ బ్రేక్ వద్ద దాచిన రూ.1.01 కోట్ల నగదు పోలీసులు కనుగొన్నారు. వ్యాపారి సూరజ్,కారు డ్రైవర్ షేక్, అజయ్‌లతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. భాగస్వాములను మోసం చేయడం, అప్పులను ఎగవేయడం తదితరాల కోసం ఉత్తుత్తి దోపిడీ నాటకమాడారని గుర్తించారు. డబ్బు గురించి ఐటీ అధికారులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు
యోగేశ్వర్‌పై కొడుకు
ఫోర్జరీ కేసు
దొడ్డబళ్లాపురం: ఇటీవల జరిగిన చెన్నపట్టణ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీపీ యోగేశ్వర్ కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. యోగేశ్వర్ మొదటి భార్య కుమారుడు శ్రవణ్ తండ్రిపై ఫోర్జరీ కేసు దాఖలు చేశాడు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. యోగేశ్వర్ మొదటి భార్య, ఆమె కుమారుడు శ్రవణ్ రెండేళ్ల క్రితం బెంగళూరులో ఒక ఇల్లు కొన్నారు. దానిని శ్రవణ్.. తన సోదరి నిషాకు కానుకగా రాయించారు. శ్రవణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన యోగేశ్వర్.. ఇంటిని కానుకగా ఇవ్వలేదని, తనకూ భాగం కావాలని శ్రవణ్ కేసు వేసినట్టు నాటకమాడారు. ఇది తెలిసి శ్రవణ్ కోర్టులో యోగేశ్వర్‌పై కేసు వేశాడు.
అయ్యప్ప స్వాముల
బస్సు బోల్తా
దొడ్డబళ్లాపురం: శబరిమల యాత్ర నుంచి వస్తున్న కర్ణాటక భక్తుల బస్సు ప్రమాదానికి గురై 27 మంది గాయపడిన సంఘటన కేరళ వయనాడ్ వద్ద జరిగింది. మైసూరు జిల్లా హుణసూరుకు చెందిన భక్తులు 15వ తేదీన అయ్యప్ప ఆలయంలో దర్శనాలు చేసుకుని వెనుదిరిగారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మలుపులో బస్సు బోల్తా పడింది. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. 27 మందికి గాయాలు కాగా వారిని వయనాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment