నదిలో శవమైన బ్యాంకు మేనేజర్
● శివమొగ్గ జిల్లాలో సంఘటన
శివమొగ్గ: అనుమానాస్పద స్థితిలో తుంగా నదిలో మునిగి ఓ బ్యాంకు మేనేజర్ మరణించగా, అతని మృతదేహం తీర్థహళ్లి దగ్గర నదితీరంలో లభించింది. వివరాలు.. తాలూకాలోని అరళసురుళిలోని యూనియన్ బ్యాంకు శాఖ మేనేజర్ శ్రీవత్స (38), సోమవారం ఉదయం నది ఒడ్డున దుస్తులు, చెప్పులు, మొబైల్ ఫోన్ వదిలి నదిలోకి దిగినట్లు సమాచారం. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలింపు చేపట్టగా, అతని మృతదేహం బుధవారం కొంత దూరంలోని తీర్థహళ్లి వద్ద కనిపించింది. దుస్తుల్లో లభించిన కార్డులు, మొబైల్‌లోని సమాచారం ఆధారంగా మృతుడిని బ్యాంకు మేనేజర్‌గా గుర్తించారు. మృతుడు ఒక్కరే తీర్థహళ్లిలో నివాసం ఉంటుండగా, కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదమా, ఆత్మహత్యా అనేది పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖపట్నంలోని కుటుంబీకులకు సమాచారం అందజేశారు.
విద్యార్థి ఆత్మహత్య
శివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకా చిక్కమణతి గ్రామంలో పదో తరగతి విద్యార్థి ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. అనుదీప్ (16), ఇతనికి చదువులో ఆసక్తి తక్కువగా ఉండేది. ఈ కారణంతో ఇతనికి తల్లిదండ్రులు చికిత్స ఇప్పించారు. ఇలా ఉండగా ఈనెల 15న విద్యార్థికి వాంతులు కావడంతో గమనించిన ఒకరు విచారించగా, అతను కలుపు మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి, తరువాత శివమొగ్గ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పాడని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయింది.
సర్కారీ ఆస్పత్రిలో బాలింత మృతి
దొడ్డబళ్లాపురం: వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత చనిపోయిందని ఆరోపించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సంఘటన బెళగావిలోని బిమ్స్ ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. రామదుర్గ తాలూకా వాగనూర తాండా నివాసి నిండు గర్భిణి కల్పన లమాణి (26) రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే హఠాత్తుగా బుధవారం ఉదయం తల్లి చనిపోయింది. బిడ్డ ఐసీయూలో ఉంది. రెండు సార్లు సిజేరియన్ చేసి కల్పన మృతికి వైద్యులు కారణమయ్యారని ఆమె బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు బైఠాయించి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. పోలీసులు, వైద్యాధికారులు వారితో మాట్లాడి నచ్చజెప్పారు.
శీఘ్రమే కాలేయం తరలింపు
దొడ్డబళ్లాపురం: బెళగావి నుంచి బెంగళూరుకు విమానంలో మానవ కాలేయాన్ని తరలించారు. బెళగావిలో ఒక దాత నుంచి సేకరించిన లివర్‌ను రోడ్డు మార్గాన హుబ్లి వరకూ తీసికెళ్లి అక్కడి నుంచి విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో రోగికి ఆపరేషన్ చేసి అమర్చారు. రోగి బంధువులు, వైద్యుల కోరిక మేరకు పోలీసులు బెళగావి నుండి హుబ్లి ఎయిర్‌పోర్టు వరకూ, బెంగళూరులో ఎయిర్‌పోర్టు నుంచి ఆస్పత్రి వరకూ ట్రాఫిక్ లేకుండా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment