ఓటమి భారం.. కూటమి నిర్వేదం
సాక్షి, బెంగళూరు: విజయం లభిస్తుందనుకున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి. సరే, ఉప ఎన్నికలలోనైనా సత్తా చాటుకుందామని ఆశిస్తే అక్కడా భంగపాటే. ఇదీ కన్నడనాట కాషాయ దళపతుల విషాదం. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీకి ఇప్పుడు పూర్వ వైభవం తేవడం ఎలా అని రాష్ట్ర, జాతీయ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఈ నెల 23న ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన చెన్నపట్టణ, సండూరు, శిగ్గావిలో బీజేపీ రెండుచోట్ల, మిత్రపక్షం జేడీఎస్ ఒకచోట పోటీ చేశాయి. రెండు పక్షాల ఓట్లు కలిసి, కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో కలిసి సునాయాస విజయం లభిస్తుందని ఇరుపక్షాల నాయకులు లెక్కలు వేసుకుంటే అన్నీ తారుమారయ్యాయి. మూడింటా నేలకరవడంతో బీజేపీ పెద్దలకు మింగుడు పడడం లేదు.
లోక్‌సభ ఎన్నికల నుంచి పొత్తు
లోక్‌సభ ఎన్నికల ముందు ప్రారంభమైన జేడీఎస్, బీజేపీ పొత్తు ఉప ఎన్నికల్లోనూ కొనసాగింది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాల్లో గెలుపు సాధించి సిద్దరామయ్య నాయకత్వలంలోని కాంగ్రెస్ సర్కారుకు సవాల్ విసిరింది. ఈ మైత్రి కారణంగా జేడీఎస్ నుంచి హెచ్‌డీ కుమారస్వామి కేంద్ర మంత్రి అయ్యారు. తాజా ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో కంగుతిన్నారు.
భావావేశాలే ప్రధానం
ఉప ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి విషయాల కంటే కూడా భావావేశాలకే పెద్దపీట వేశారు. బీజేపీ వక్ఫ్ భూ చట్టం అంశాన్ని ఎక్కువగా ప్రచారంలో ఉపయోగించుకుంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ కులం, మతం అనే అస్త్రాలను ప్రయోగించింది. బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతల వాగ్బాణాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం దాదాపు ఖాయమనే ఊహాగానాలు, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పేశాయి. అయితే ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
మూడుచోట్ల ముచ్చెమటలు
● సండూరులో మాజీ మంత్రి బి.శ్రీరాములు టికెట్ ఆశించినప్పటికీ ఎన్నికల్లో బీజేపీ ఎస్‌టీ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు బంగారు హనుమంతప్పకు టికెట్ దక్కింది. నేతలు కలసికట్టుగా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ గెలుపును పొందలేకపోయారు.
● శిగ్గావిలో బసవరాజు బొమ్మై ఎంపీ కావడంతో రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో కొడుకు భరత్‌కి టికెట్ ఇప్పించుకున్నారు కానీ గెలిపించుకోలేకపోయారు.
● చెన్నపట్టణలోనూ ఇదే చిత్రం. కుమారస్వామి ఎంపీగా ఎన్నిక కావడం, ఆ స్థానం ఖాళీ పడడంతో తనయుడు నిఖిల్‌ని నిలిపారు. కానీ విజయం వరించలేదు.
● ఉప ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఓట్లు చీలిపోయినట్లు అంచనాలున్నాయి. పార్టీల పరంగా కంటే అభ్యర్థులు, స్థానిక అంశాలనే ఓటర్లు పట్టించుకున్నారు.
● సిద్దరామయ్యపై ముడా ఇళ్ల స్థలాల కేసులు, వందలాది కోట్ల రూపాయల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం, వక్ఫ్ భూ చట్టం తదితరాలను ఓటర్లు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.
స్కాములు పక్కకు, స్థానిక అంశాలే ముందుకు
బీజేపీ, జేడీఎస్ మధ్య జరగని ఓట్ల బదిలీ
కార్యాచరణపై అంతర్మథనం
Comments
Please login to add a commentAdd a comment