లారీ బీభత్సం.. కరెంటు స్తంభాలు ముక్కలు
బొమ్మనహళ్లి: బెంగళూరులో బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరిధిలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సామసంద్ర పాళ్యలో ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్నారు. ఇంతలో ఏవో ఫెళఫెళమంటూ భారీ శబ్ధాలు, విరిగిపడుతున్న చప్పుళ్లు. క్షణాల్లోనే అంతటా కరెంటు పోయింది. ఏం ప్రళయం వచ్చిందోనని ప్రజలందరూ తల్లడిల్లిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా సాహసించలేదు.
తీగలను లాక్కుంటూ...
దీనంతటికీ కారణం. ఓ లారీ. భారీ లోడుతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించడంతో ఏడు కరెంటు స్థంబాలు విరిగిపోయాయి. మహారాష్ట్ర నంబర్ ఉన్న లారీ పెద్ద లోడుతో హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ మీదుగా వచ్చి సామసంద్రపాళ్య నుంచి కూడ్లుకు వెళ్తోంది. అయితే సామసంద్రపాళ్యలో రోడ్డు మీద ఉన్న వైర్లు లారీకి తగిలినా డ్రైవర్, క్లీనర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో తీగలు లాగడంతో కరెంటు స్తంబాలు ఉన్నపళంగా విరిగిపడసాగాయి. సర్కిల్ నుంచి ప్రభుత్వ స్కూల్ వరకు సుమారు 7 కరెంటు పోల్స్ అడ్డదిడ్డంగా కూలిపోయాయి. వెంటనే కరెంటు కూడా పోయి ప్రజలు చీకట్లో మగ్గిపోయారు. లారీ డ్రైవర్ సుమారు 200 మీటర్ల వరకు తీగలను లాక్కుంటూ వెళ్లాడు. సోమవారం ఉదయం నుంచి బెస్కాం అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను పట్టుకుని బండెపాళ్య పోలీసులకు ఆప్పగించారు. లారీని కూడా సీజ్ చేశారు. ఇదే ప్రమాదం పగటిపూట జరిగి ఉంటే పర్యవసానాలు ఘోరంగా ఉండేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదు.
నేలకూలిన 7 పోల్స్, విద్యుత్ కట్
సామసంద్రపాళ్యలో అర్ధరాత్రి
గందరగోళం
Comments
Please login to add a commentAdd a comment