దూకుడుగా ప్రచారం! | Sakshi
Sakshi News home page

దూకుడుగా ప్రచారం!

Published Wed, May 8 2024 11:50 PM

దూకుడ

● ఇంటింటికీ తిరుగుతూ.. పని ప్రదేశాల్లో ఓటర్లను కలుస్తూ ● అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రధాన పార్టీల నేతలు ● ఆన్‌లైన్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్న వైనం

ఆసిఫాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు దూకుడు పెంచాయి. ఆ పార్టీల ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుండగా.. ఎలాగైనా ఎంపీ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రస్‌ యత్నిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ సైతం ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆసిఫాబాద్‌లో జనజాతర పేరిట నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. స్థానికంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేకున్నా ఇన్‌చార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మరో వైపు కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మైదానంలో నిర్వహించిన సభకు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరై ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

చేరికలతో కాంగ్రెస్‌లో జోష్‌

జిల్లాకు చెందిన వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీలో జోష్‌ పెరిగింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలవకున్నా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ పురాణం సత్తీశ్‌తోపాటు మాజీ ఏఎంసీ చైర్మన్‌ గాదెవేణి మల్లేశ్‌, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, గోపాల్‌నాయక్‌ తదితరులు హస్తం గూటికి చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు ఆధ్వర్యంలో వీరు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఉపాధిహామీ పని ప్రదేశాల్లోనూ ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

గడపగడపకూ బీజేపీ

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు దీటుగా బీజేపీ క్షేత్రస్థాయిలో వేగం పెంచింది. గతంలో జిల్లాలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్‌ లేదు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌ సోదరులతోపాటు వారి అనుచరుల చేరికతో ఆ పార్టీకి బలం పెరిగింది. గతంలో ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించిన అరిగెల సోదరులు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్‌ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేసింది. అక్కడ పాల్వాయి హరీశ్‌బాబు పార్టీ విస్తరణకు కీలకంగా మారారు. ఇటీవల కాగజ్‌నగర్‌ సభలోనూ స్థానిక అంశాలను ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

సక్కు గెలుపునకు పావులు

జిల్లాలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ బీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలు ఎత్తుకున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపునకు పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలమైన క్యాడర్‌ ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకున్న సక్కు గెలుపు కోసం తీవ్రంగా పాటుపడుతున్నారు. అయితే ఇటీవల కీలక నేతలు పార్టీని వీడటం మైనస్‌గా మారింది. ప్రచారంలో భాగంగా జిల్లాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప పార్టీని వీడటంతో క్యాడర్‌ను ముందుకు నడిపించే బాధ్యతను ఎమ్మెల్సీ దండె విఠల్‌ తీసుకున్నారు. పెంచికల్‌పేట్‌, కౌటాల, దహెగాం, బెజ్జూర్‌ మండలాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఆత్రం సక్కుతో కలిసి వరుస సభలు నిర్వహిస్తున్నారు.

దూకుడుగా ప్రచారం!
1/1

దూకుడుగా ప్రచారం!

Advertisement
 
Advertisement
 
Advertisement