రాలిన విద్యా కుసుమం | - | Sakshi
Sakshi News home page

రాలిన విద్యా కుసుమం

Published Tue, Nov 26 2024 12:50 AM | Last Updated on Tue, Nov 26 2024 12:50 AM

రాలిన

రాలిన విద్యా కుసుమం

వారిది నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. పేదింట్లో పుట్టిన విద్యా కుసుమం శైలజ. తమలా బిడ్డలు కాకూడదనుకుని, బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు. గ్రామంలో ఉంటే చదవడం కుదరదని బిడ్డను గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఆశ్రమంలో 60 మందికిపైగా విద్యార్థినులు ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురయ్యారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం అందరూ కోలుకున్నారు. శైలజ మాత్రం భవిష్యత్‌ కలలు నెరవేరకుండానే మృత్యువుతో పోరాడి ఓడింది. ఆరోగ్యం విషమించి సోమవారం మృతిచెందింది. నెల రోజుల నుంచి పత్తి చేను, ఇంటిని వదిలి బిడ్డ కోసం ఆస్పత్రిలో ఎదురుచూసిన కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చి వెళ్లిపోయింది.

వాంకిడి(ఆసిఫాబాద్‌): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ బాలి కల పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ(14) సోమవా రం మృతి చెందింది. చదువుకునే వయస్సులో బాలిక మృతి చెందడంతో వాంకిడి మండలం ధాబా గ్రామంలో విషాదచాయలు అలుముకున్నా యి. ధాబాకు చెందిన చౌదరి తుకారాం, మీరాబా యి దంపతులకు కుమార్తె శైలజ, కుమారుడు నవనీత్‌ ఉన్నారు. శైలజ వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి, కుమారుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. అక్టోబర్‌ 30న ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురై 60 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాలలో చికిత్స అందించారు. శైలజ ఆరోగ్యం మొదట్లోనే విషమించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ నెల 5 నుంచి శైలజకు వెంటిలేట ర్‌పై చికిత్స కొనసాగించారు. నిమ్స్‌లో చేరిన నాటి నుంచి శైలజ 21 రోజులపాటు ఉలుకుపలుకు లేకుండా మృత్యువుతో పోరాడింది. మంత్రులు, మాజీ మంత్రులు శైలజ తల్లిదండ్రులను పరామర్శించి భరోసా కల్పించారు. సోమవారం మధ్యాహ్నం శైలజ తుది శ్వాస వదలడంతో ఆస్పత్రి వద్ద తల్లి కన్నీటిపర్యంతం కాగా, స్వగ్రామంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇంటి వద్ద రోదిస్తున్న

శైలజ తమ్ముడు, కుటుంబ సభ్యులు

ప్రాణాలు పోతున్నా పట్టింపేది?

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. ఏటా వసతి గృహాల్లోని విద్యార్థులు అనారోగ్యం బారినపడుతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే ఆరోణలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు 102 ఉన్నాయి. ఇందులో 27,978 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 46 ఆశ్రమ వసతి గృహాల్లో 12,562 మంది ఉండగా, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది, ఏడు గిరిజన గురుకుల(పీటీజీ)ల్లో 2,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకులాల్లో 1,185, రెండు మోడల్‌ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్‌ మెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ వసతి గృహాల్లో 980 మంది విద్యార్థులు ఉన్నారు.

జిల్లాలో జరిగిన ఘటనలు

2022 ఆగస్టు 23న పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలం రాజేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

ఆగస్టు 28న సిర్పూట్‌(టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గోమాస అశ్విని అనారోగ్యంతో మృతి చెందింది.

ఆగస్టు 29న తిర్యాణి ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న టేకం రమేశ్‌ మృతి చెందాడు.

సెప్టెంబర్‌ 1న జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్స రం చదువుతున్న లావుడే సంగీత జ్వరంతో మృతి చెందింది. అదే కళాశాలలో తృతీయ సంవత్సరం చదుతున్న కుమురం లక్ష్మి 2024 జూ లై 29న మృతి చెందింది.

వాంకిడి గిరిజన ఆశ్రమంలో 60 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత

మృత్యువుతో పోరాడి ఓడిన శైలజ

ఆరోగ్యం విషమించి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మృతి

ధాబా గ్రామంలో విషాదచాయలు

పలు ఆస్పత్రుల్లో కోలుకున్న మిగిలిన బాలికలు

నెలరోజులుగా ఇంటికి తాళం

ఆశ్రమ వసతి గృహంలో చదువుకుంటున్న శైలజ అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులు వదిలేసి కుమారుడిని స్థానికంగా ఉంటున్న నానమ్మ వద్ద ఉంచి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. చౌదరి తుకారాం, మీరాబాయికి సొంతంగా పట్టా భూమి లేకపోవడంతో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి చేతికందే సమయంలోనే కుమార్తె అస్వస్థతకు గురికావడంతో పనులన్నీ వదిలేసి వెళ్లారు. అప్పటి నుంచి నానమ్మ వద్ద ఉన్న కుమారుడు బడికి వెళ్లకుండా ఇంటి వద్ద పశువులను చూసుకుంటున్నాడు. నవనీత్‌ గ్రామ శివారులోని అటవీప్రాంతంలోకి ఆదివారం పశుగ్రాసం కోసం వెళ్లగా, అక్కడ పెద్దపులిని చూసి గ్రామానికి పరుగులు తీశాడు. చేనులో పత్తి నేలరాలిపోతున్నా పట్టించుకోకుండా బిడ్డ కోలుకుని తమతో మాట్లాడుతుందని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కానీ చివరికి బిడ్డ ప్రాణాలు దక్కకపోవడంతో తల్లడిల్లిపోయారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శైలజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రత్యేక వాహనంలో సోమవారం రాత్రి స్వగ్రామానికి తరలించారు.

ఎవరూ ఏమీ చెప్పేవారు కాదు

‘తన కూతురు హాస్టల్‌లో అనారోగ్యం బారిన పడిన నాటి నుంచి ఎవరూ ఏమీ చెప్పేవారు కాదు. నెల రోజులు ఆస్పత్రిలో ఉన్నా నా బిడ్డ కోలుకుంటదా.. లేదా అనే విషయాలు వెల్లడించలేదు. ఈ రోజు ఉదయం వచ్చిన డాక్టరును అడిగితే ఏమి చెప్పలేం అని సమాధానం ఇచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురిని బతికించలేకపోయారు..’ అంటూ గాంధీ ఆస్పత్రి వద్ద సోమవారం శైలజ తల్లి మీరాబాయి విలపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
రాలిన విద్యా కుసుమం1
1/2

రాలిన విద్యా కుసుమం

రాలిన విద్యా కుసుమం2
2/2

రాలిన విద్యా కుసుమం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement