పులి సంచారం.. భయం భయం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలంలో పెద్దపులి భయం మళ్లీ మొదలైంది. గతేడాది పత్తితీత సమయంలోనే బెబ్బులి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బండకాస, ధాబా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసి ఐదింటిని గాయపర్చింది. పత్తితీత పనులు జోరుగా సాగుతున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనులకు వెళ్తున్నారు.
పశువుల మందపై దాడి
గిరిజన ఆశ్రమ విద్యార్థిని శైలజ నిమ్స్‌లో చేరినప్ప టి నుంచి ఆమె తమ్ముడు నవనీత్ వారి పశువులను చూసుకుంటున్నాడు. ఆదివారం ఉదయం పది గంటలకు పశువుల మేత కోసం పొలానికి వెళ్లాడు. అటవీ ప్రాంతం నుంచి పులిని గమనించి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు అటువైపునకు వెళ్లగా మరోవైపు ఉన్న పశువుల మందపై దాడి చేసింది. కాపర్లు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు తిరిగి పశువుల మంద వైపునకు వెళ్లారు. అప్పటికే పశువులపై పులి దాడి చేస్తుండటంతో భయపడి సుమారు పదిమంది సమీపంలోని మంచె పైకి ఎక్కారు. పెద్దపులి భారీ పరిమాణంలో ఉందని, వృద్ధాప్యంలో ఉండటంతోనే పశువులను చంపలేకపోయిందని గ్రామస్తులు వెల్లడించారు. అందరూ చూస్తుండగానే దాడి చేసిందని చెబుతున్నారు. సోయం బాపురావు, తొడసం రాజేశ్వర్, మడావి మారూతి, చిక్రం భీంరావులకు చెందిన పశువులు గాయపడ్డాయి.
సీసీ కెమెరాలు ఏర్పాటు
బండకాస, ధాబా గ్రామాల్లో పులిదాడి విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్వో గోవింద్‌సింగ్ సర్దార్ ఆధ్వర్యంలో అధికారులు పాదముద్రలను గమనిస్తూ జాడ కోసం వెతికారు. అడవిలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ రేంజర్ సరోజరా ణి సంప్రదించగా.. కెమెరాకు చిక్కితే గానీ దాడి చేసింది ఏ పులి అనేది చెప్పడం కష్టమన్నారు. పాదముద్రల ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. పెద్దపులి బండకాస వైపు నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఎకో బ్రిడ్జిపై నుంచి గోయేగాం అడవుల్లోకి వెళ్లినట్లు తెలిపారు. మరోవైపు గోయేగాం అడవుల మీదుగా పులి వెళ్తుండగా వీడియో తీసినట్లు గ్రామస్తులు చెప్పడంతో పులి వేరే ప్రాంతానికి వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాంకిడి మండలంలో ఆదివారం ఐదు పశువులపై దాడి
ధాబా శివారులోనే తిరిగినట్లు పాదముద్రలు
అడవిలో సీసీ కెమెరాలు అమర్చిన అటవీశాఖ అధికారులు
బెబ్బులి గాండ్రింపులు!
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన మండలాల ప్రజల్లో పెద్దపులి మరోసారి అలజడి రేపింది. నాలుగైదు రోజుల క్రితం వరకు కెరమెరి మండలం జోడేఘాట్ అడవుల్లో సంచరించగా, సోమవారం చిత్తగూడ, సోమ్లగూడ, కరంజివాడ, అనార్‌పల్లి గ్రామాల్లోని రైతులు, ప్రజలు పులి గాండ్రిపులతో భయభ్రాంతులకు గురయ్యారు. బెబ్బులి అలజడితో వ్యవసాయ పనుల్లో ఉన్నవారు భయంతో ఇళ్లకు చేరుకున్నారు. జోడేఘాట్ అడవుల నుంచి నార్నూర్ మీదుగా ఆదిలాబాద్ మండలం మావల ప్రాంతం మీదుగా మహారా ష్ట్ర బెబ్బులి వెళ్లిందని అంతా భావించారు. సమాచారం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌వో మజా రొద్దీన్ అధికారులతో కలిసి సమీప అడవుల్లో పులి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సుమారు పది కిలోమీటర్ల మేర బృందాలు గా ఏర్పడి తిరిగినా పాదముద్రలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించారు. అటవీ అధికారులు విజయ్‌కుమార్, రామయ్య, నజీర్ అలీ, న ర్సయ్య, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment