ప్రజా భద్రత విషయంలో రాజీ పడం
హోం మంత్రి వంగలపూడి అనిత
విజయవాడస్పోర్ట్స్: ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సురక్షా కమిటీల ద్వారా నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ సరికొత్త ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సురక్షా కమిటీలను విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో హోం మంత్రి అనిత బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సురక్షా కమిటీ కో ఆర్డినేటర్‌గా కేవీ నరసయ్య నియమితులయ్యారు.
దాతల ప్రోత్సాహం అభినందనీయం..
డీజీపీ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. విజయవాడ నగరంలోని బ్లాక్‌స్పాట్‌లలో ఏర్పాటు చేసేందుకు 1,150 సీసీ కెమెరాలను వితరణగా ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ విజయవాడ నగరంలోని పోలీస్ క్వార్టర్స్, పోలీస్ స్టేషన్‌ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. అనంతరం 1000 సీసీ కెమెరాలతో పాటు, ఈగల్ వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాంరాజగోపాల్‌తాతయ్య, కొలికిపూడి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు, డీసీపీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment