ఓపీలో వైద్యులు లేకుంటే ఎలా?
బందరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై మంత్రి కొల్లు ఆగ్రహం
మచిలీపట్నంటౌన్: బందరులోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న నలుగురు కీలక వైద్యులను సదరం ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఇతర ప్రాంతాలకు పంపడంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నేత్ర విభాగంలో ఉన్న ఇద్దరు వైద్యులు జి. భానుమూర్తి, అమృత, చెవి, ముక్కు, గొంతు విభాగంలో ఉన్న వైద్యురాలు సి. అనితను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డి. ఆశాలత సోమవారం ఆదేశించారు. దీంతో ఆయా విభాగాల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ రోజు నేత్ర శస్త్ర చికిత్సల కోసం వచ్చిన 20 మంది రోగులు, ఓపీల వద్దకు వచ్చిన రోగులు వైద్యం పొందకుండానే ఇంటి ముఖం పట్టారు. ఈ విషయం ఈ నెల 21వ తేదీ మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ‘జీజీహెచ్‌లో నిలిచిన వైద్య సేవలు’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర ఆస్పత్రిలోని ఓపీలను సైతం మూసేసి ఇతర విధులకు కీలక వైద్యులను పంపిన సూపరింటెండెంట్ ఆశాలత చర్యను తప్పుపట్టినట్లు తెలిసింది. సదరం విధులను పక్కన పెట్టి గురువారం నుంచి జీజీహెచ్‌లో వైద్య సేవలకు అందుబాటులో ఉండాలని వైద్యులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం మీడియాలో రావటానికి కారణమంటూ నేత్ర వైద్య నిపుణుడు భానుమూర్తికి సూపరింటెండెంట్ ఆశాలత బుధవారం మెమో ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment