ఖర్చు ఘనం.. అభివృద్ధి శూన్యం
పెడన: చరిత్ర కలిగిన కలంకారీపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ పరిశ్రమ అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ హడావుడి చేస్తోంది. ఇప్పటికే కలెక్టర్ డీకే బాలాజీ పరిశ్రమలు, చేనేత జౌళి శాఖాధికారులతో పెడనలో పలు స్థలాలను క్లస్టర్ ఏర్పాటు కోసమని పరిశీలించి వెళ్లారు. అయితే గతంలో కలంకారీ అభివృద్ధి కోసమంటూ నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న కార్మికుల నుంచి వస్తోంది. గతంలో కూడా కలంకారీ క్లస్టర్ అంటూ నిధులు మంజూరయ్యాని, అసలు అవి ఏమయ్యాయో కూడా తమకు తెలీదని పలువురు కళాకారులు చెబుతుండటం గమనార్హం.
శిథిలావస్థలో శిక్షణ కేంద్రం..
పెడన బైపాస్ రోడ్డులోని తన సొంత స్థలంలో రిటైర్డ్ ఆర్మీ జవాను సువర్ణరాజు ఎస్సీ కార్పొరేషన్ రుణంతో కలంకారీ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. కొన్నాళ్ల పాటు శిక్షణ తరగతులు కూడా బాగానే జరిగాయి. ఆ తరువాత ఏమైందో ఏమో ఆగిపోయింది. తరువాత కాలంలో సువర్ణరాజు మృతి చెందడం, ఆ భవనం కాస్తా శిథిలావస్థకు చేరిపోయింది. ప్రస్తుతం ఈ భవనంపై వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కా భవనం.. పక్కదారి..
పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే టూరిజం వారు పక్కా భవనాన్ని నిర్మించారు. కలంకారీకి సంబంధించి అన్ని వివరాలను తెలియజేసేలా గైడ్‌ను పెట్టి టూరిజం ద్వారా వచ్చే వారికి తెలియజేసేందుకు తగు చర్యలు తీసుకున్నారు. భవనం నిర్మించారే తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. రూ.లక్షలు పెట్టి కట్టిన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం అందులో సంచార జాతుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
అడపాదడపా అలా..
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో కలంకారీ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా నిరుపయోగంగా ఉంటుంది. మూసి ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఏడాదిలో ఒకసారి వారికి అవకాశం ఉన్నప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు.
లక్షలు పెట్టి నిర్మించి వదిలేస్తే ఎలా?
రూ.లక్షలు పెట్టి భవనాలు నిర్మించి ఖాళీగా వదిలేయడం పట్ల కలంకారీ వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడమేనని, ఉపయోగపడేలా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వర్కర్ల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొత్తగా రానున్న కలంకారీ క్లస్టర్‌ను నిర్మిస్తే నిరంతరం పనిచేసేలా, వర్కర్లకు, వ్యాపారస్తులకు ఉపయోగపడేలా ఉండాలంటున్నారు.
రూ. 2కోట్లు ఏం చేశారో?
గతంలో క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2కోట్లు నిధులు విడుదలయ్యాయని కార్మికులు చెబుతున్నారు. ఆ నిధులు విడుదలైన సందర్భంగా అప్పటి ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలంకారీ వస్త్ర వ్యాపారులు ఎంతో ఘనంగా సత్కరించిన సందర్భాన్ని సైతం వారు గుర్తు చేస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియదని చెబుతున్నారు.
శిథిలావస్థకు చేరుతున్న మాజీ ఆర్మీ జవాన్ నిర్మించిన కలంకారీ శిక్షణ కేంద్ర భవనం
గతంలో పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్మించిన వైనం వాటివైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు అంటూ హడావుడి గతంలోనూ క్లస్టర్ పేరిట నిధులొచ్చినట్లు గుర్తుచేస్తున్న కార్మికులు అవి ఏమయ్యాయో కూడా తెలీదని ఆవేదన
అభిప్రాయాలు సేకరించాలి..
కలంకారీ క్లస్టర్ నిర్మాణం జరిగితే సంతోషమే. అయితే ఈ క్లస్టర్‌కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఏమిటనేది అందరికీ తెలియజేయాలి. ఆ క్టస్టర్ ప్రధానంగా వర్కర్లకు ఉపయోగపడేలా ఉండాలి. గతంలో నిర్మించిన భవనాలను కూడా పూర్తిగా క్లస్టర్‌కు అనుసంధానం చేసి వినియోగంలోకి తీసుకురావాలి. కలంకారీ క్లస్టర్ నిర్మాణానికి సంబంధించి రాజకీయ పార్టీలకు అతీతంగా కమిటీలను వేసి వర్కర్లకు కూడా ఆ కమిటీలో ప్రాధాన్యం కల్పించి చిన్న చిన్న కలంకారీ యూనిట్లకు కూడా మార్కెటింగ్ అవకాశం ఇవ్వాలి. క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి చర్చావేదికలు, అభిప్రాయాలు సేకరించి, సభలు పెట్టి తెలియజేస్తే మంచి ఫలితాలుంటాయి.
– కట్టా హేమసుందరరావు,
చేనేత కార్మిక సంఘ నాయకుడు, పెడన
Comments
Please login to add a commentAdd a comment