దుర్గమ్మపై రచనలను ప్రోత్సహిస్తాం
ఆలయ ప్రాంగణంలో కనకదుర్గమ్మపై పాట ఆవిష్కరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ విశిష్టత, అమ్మవారి వైభవంపై వచ్చే రచనలను ప్రోత్సహిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పేర్కొన్నారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై పాత్రికేయుడు, హాస్య బ్రహ్మ శంకర నారాయణ రచించిన కనకదుర్గమ్మ పాటను ఆదివారం ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్‌లో ఆవిష్కరించారు. గీత రచయిత శంకర నారాయణ అమ్మవారి కనకదుర్గ శతకాన్ని చూపగా కమిషనర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాటను తానే స్వరపరిచినట్లు శంకర నారాయణ వివరించగా, పాటను రాయారావు విశ్వేశ్వర్‌రావు గానం చేయగా, దోర్బల లిఖిత, రాయారావు వివానీ సంగీతాన్ని ఇచ్చారు. అమ్మవారిపై ఎవరు రచనలు చేసినా తాను ప్రోత్సహిస్తానని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం శంకర నారాయణతో పాటు పాట ఆవిష్కరణకు విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, అధికారులు ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment