కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్పపాటి వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం హుటాహుటిన కళాశాలకు పరుగులు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థుల మధ్య పంచాయితీ చేసింది. విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కటంతో సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ఘటనపై ఆరా తీస్తుండగా కాలేజీ యాజమాన్యం స్పందించి విషయాన్ని తామే సర్దుబాటు చేసుకుంటామని విజ్ఞప్తి చేయడంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. కళాశాలకు చెందిన విద్యార్థులు పలువురు ఆదివారం కళాశాలకు సమీపంలోని గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా అందులో ఓ జూనియర్ విద్యార్థికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆ విద్యార్థి ఫీల్డింగ్ వదిలి ఫోన్‌లో మాట్లాడుతుండటంతో సీనియర్ విద్యార్థులు అతడిని మందలించారు. దీంతో జూనియర్లు, సీనియర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను అవమానంగా భావించిన జూనియర్ విద్యార్థి ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి సీనియర్లు తనపై దాడికి పాల్పడుతున్నారంటూ చెప్పాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు బందరు చేరుకుని మందలించిన విద్యార్థులపై దాడికి దిగారు.
దీంతో జూనియర్లు, సీనియర్ల మధ్య కళాశాల ఎదుట స్వల్పపాటి కొట్లాట జరిగింది. విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు కళాశాల వద్దకు చేరుకుని రెండు వర్గాల మధ్య సర్దుబాటు చేసేందుకు యత్నిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు కళాశాల యాజమాన్యం సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేసినట్లు సమాచారం. ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం ఆయన సమక్షంలో విద్యార్థుల మధ్య సమస్య పునరావృతం కాకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
బందరు మెడికల్ కళాశాలలో విద్యార్థుల కొట్లాట రంగంలోకి దిగిన బందరు రూరల్ పోలీసులు విద్యార్థుల మధ్య పంచాయితీ చేసిన యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment