జ్వర భద్రం!
దోమలు వ్యాపించకుండా చర్యలు
కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో ఎలీసా టెస్ట్ ద్వారా వచ్చిన డెంగీ నిర్ధారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాము. డెంగీ వ్యాధి నిర్ధారణ అయిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నాము. మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి పాజిటివ్ కేసు వచ్చిన రోగి ఇంటి పక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాము. నీళ్లు నిలిచిన చోట యాంటిలార్వా చర్యలు తీసుకుంటున్నాము. దోమలు ఎక్కువగా ఉంటే మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్ ఆపరేషన్ చేస్తున్నాము.
–నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు
డెంగీ పట్ల జాగ్రత్తగా ఉండాలి
సాధారణ మనిషిలో ప్లేట్‌లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సీజన్‌లో ఈ రక్తకణాల సంఖ్య 10వేలలోపు ఉంటే మాత్రమే జాగ్రత్తగా ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి. జ్వరం తగ్గినా కూడా వారం తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఈ దశలో శరీరంలో వాపులు వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దశలో ఒంట్లో రక్తస్రావం మొదలై బీపీ తగ్గి ప్రాణాంతకమవుతుంది. కనుక ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడమే ఉత్తమం.
–డాక్టర్ మీనిగ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ విభాగం, జీజీహెచ్, కర్నూలు
దోమ పుట్టకూడదు...దోమ కుట్టకూడదనేది ప్రభుత్వ నినాదం. దోమ పుడితే అది మనుషులను కుడుతుంది. తద్వారా ప్రాణాంతకమైన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చి మనిషి ప్రాణం మీదకు తెస్తాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే దోమల నివారణ చర్యలొక్కటే మార్గం. మన ఇళ్లు, పరిసరాల్లో అవి పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
– కర్నూలు(హాస్పిటల్)
ఆరేళ్లుగా జిల్లాలో డెంగీ కేసుల వివరాలు
సంవత్సరం అనుమానిత పాజిటివ్
కేసులు కేసులు
2019 373 63
2020 81 10
2021 1,169 170
2022 4,088 342
2023 2,484 409
2024(మే 12వరకు) 501 167
జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులో ఏరియా ఆసుపత్రులు, 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 400లకు పైగా నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. గత నెలలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ నెల మొదటి వారం తర్వాత వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఈ మేరకు అక్కడక్కడా వర్షపు నీరు నిలబడటం సాధారణమైంది. ఈ పరిస్థితులు డెంగీ దోమలు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో జ్వరం లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీ నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే వెంటనే రక్తం, ప్లేట్‌లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తోంది.
డెంగీ ఎలా సోకుతుందంటే...!
ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటుతో డెంగీ సోకుతుంది. ఈ దోమ ఒంటిపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. అందుకే దీనిని పులిదోమ అని కూడా అంటారు. ఇది శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదయమైన రెండు గంటల వరకు, సూర్యోదయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లు పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక దాక్కుంటాయి.
డెంగీ వ్యాధి లక్షణాలు
తీవ్రమైన తలనొప్పి,కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవిస్తుంది.
ప్రాథమిక చికిత్స ఇలా చేయాలి
●ప్రాథమికంగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలి
●జ్వరం తీవ్రంగా ఉంటే తడిబట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి.
●జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్‌ను వైద్యుల సూచన మేరకు వాడుతూ ఉండాలి.
●ముఖ్యంగా శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగుతూ ఉండాలి.
●సాధ్యమైనంత త్వరగా వైద్యులను కలిసి మందులు వాడాలి.
●అధిక శాతం ఒకటి, రెండువారాల్లో కోలుకుంటారు
ఈ దశలో ఆసుపత్రిలో చేర్చాలి
●తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు అవుతుంటే, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవించడం, మలమూత్రాల్లో రక్తం పడటం, మత్తుగా ఉండటం, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉ న్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చాలి.
●డెంగీ షాక్ సిండ్రోమ్, డెంగీ హెమరేజిక్ సిండ్రోమ్ దశలో ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి.
నివారణ చర్యలు
డెంగీకారక ఏడిస్ ఈజిప్టై దోమ పగలు మాత్రమే కుడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. చిన్నపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమతెరలు, జాలీలు వాడాలి, దోమలను చంపే క్రీములు, స్ప్రేలు వాడాలి.
రసాయనాలతో పొగబెట్టడం, ఇళ్లలో మందులు చల్లడం
ఇంటిలో, ఇంటి ఆవరణలో నీళ్ల కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో, బావులపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు అమర్చాలి.
పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బరుటైర్లు, వాటర్ కూలర్లు వంటి పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. వాటిలో నీరు నిలిచిన వారం రోజుల్లో దోమలు పెరిగే అవకాశం ఉంది.
వాతావరణంలో మార్పులతో
దోమల పెరుగుదలకు ఆస్కారం
జిల్లాలో ఏటా పెరుగుతున్న డెంగీ కేసులు
ప్రతి సంవత్సరం 350 నుంచి 400 దాకా పాజిటివ్ కేసులు
వేసవిలోనూ వెలుగు చూస్తున్న కేసులు
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి
Comments
Please login to add a commentAdd a comment