హంద్రీనది పరివాహకంలో ఆక్రమణలు తొలగించాలి
కర్నూలు(సెంట్రల్): నగరంలోని హంద్రీనది పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించి బఫర్‌జోన్ పరిధిని నిర్ణయించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్, సర్వే అధికారులతో ఐదు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బఫర్ జోన్ పరిధిని దాటి ఆక్రమణలకు పాల్పడినే వ్యక్తులకు సెక్షన్–7 కింద నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. బాధితుల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని పరిహారం మంజూరు చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్, సర్వే అధికారులతో వాగులు,వంకలు, చెరువులు, నదుల ఆక్రమణలపై సమీక్షించారు. జిల్లాలోని కేసీ కెనాల్, మొదలగు నీటి వనరులు,నీటి పరివాహక ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలపై హైకోర్టు వివరాలు కోరుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పత్తికొండ, కోడుమూరు, ఆదోని, కోసిగి, గోనె గండ్ల, ఎమ్మిగనూరు మొదలగు మండలాల్లో కూడా వాగులు, వంకలు ఆక్రమణలకు గురయ్యాయని, వాటి పరిధిలో నవంబర్ 15లోపు సర్వేచేసి నివేదించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.వెంకట నారాయణమ్మ, కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులకు
జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment