కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం దారి తప్పింది. గ్రామ స్థాయిలోని టీడీపీ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధి సిబ్బంది అక్రమార్జనకు వరంగా మారింది. వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలు, సన్న, చిన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం కాగా ఇప్పుడు అక్రమార్కులకు ఉపాధిగా మారింది. 2014 – 19 మధ్య కాలంలో టీడీపీ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధి సిబ్బంది ఉపాధి నిధులను కొల్లగొట్టారు. మళ్లీ అదే తరహాలోనే అక్రమాలకు బరితెగిస్తున్నారు. దొంగ మస్టర్లు వేసుకొని ఉపాధి నిధులతో జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ పీడీ లేకపోవడంతో పర్యవేక్షణ కరువై అక్రమాలు జోరందుకున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రోజుకు ఒక్కో జిల్లాలో 50 వేల పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. నీటి యాజమాన్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం రోజుకు కర్నూలు జిల్లాలో 16,000 మంది, నంద్యాల జిల్లాలో 10 వేల మంది పనులకు వస్తున్నట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 50 శాతం వరకు బోగస్ హాజరే ఉన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలు నియమితులయ్యారు. ఇప్పటికే 70 శాతం వారే ఉన్నారు. వచ్చీ రావడంతోనే అక్రమార్జనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మస్టర్ (హాజరు) వేయడంలోనే అక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక గ్రామంలో ఉపాధి పనులకు 25 మంది హాజరైతే 60 మంది హాజరైనట్లు దొంగ మస్టర్లు వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి పనులకు రాకపోయినా హాజరైనట్లు నమోదు చేయడంతో వారానికి రూ.1,000 నుంచి రూ.1,300 వరకు వేతనం పడుతుంది. ఆ వేతనంలో 50 శాతం ఫీల్డ్ అసిస్టెంటు రాబట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతి కుటుంబాలకు చెందిన వారికే ప్రస్తుతానికి దొంగ మస్టర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలను అరికట్టేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నా అడ్డుకట్ట పడటం లేదు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, ఆలూరు, ఆస్పరి, పెద్దకడబూరు, కౌతాళం, దేవనకొండ, కృష్ణగిరి కల్లూరు, ఓర్వకల్లు, కోడుమూరు, హాలహర్వి, కోసిగి తదితర మండలాలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా డోన్ నియోజకవర్గంలో అక్రమాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కూలీల వలస బాట..
జిల్లాలో వలసలు పెరుగుతున్నాయి. పశ్చిమ ప్రాంతం నుంచి దాదాపు 15 రోజులుగా వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పశ్చిమ ప్రాంతం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. పలు మండలాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. దీంతో వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి కరువైంది. అక్కడక్కడా ఉపాధి పనులు చేపడుతున్నా వేతనం రూ.100 లోపే వస్తుండటంతో దిక్కుతోచక కుటుంబ పోషణ కోసం భార్యాపిల్లలతో వలసబాట పడుతున్నారు. ఇప్పటికే పెద్దకడబూరు, ఆదోని, కోసిగి, హాలహర్వి, హొళగుంద, తుగ్గలి తదితర మండలాల నుంచి దాదాపు 25 వేల కుటుంబాలు వలస వెళ్లాయి. పండుగల పూట అనేక గ్రామాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
నామమాత్రపు వేతనం...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ఉపాధి పనులకు హాజరై నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే ఎన్‌ఆర్‌జీఎస్ చట్టం ప్రకారం రోజుకు రూ.300 వేతనం లభిస్తుంది. ఉపాధి పనులకు హాజరైన వారిలో 50 శాతం రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తున్నా.. రోజుకు పడుతున్న వేతనం కేవలం రూ.100 లోపే. ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో వందలాది మందికి కేవలం రూ.60 నుంచి రూ.70 వరకు మాత్రమే పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఉపాధి పనులకు రాకుండానే హాజరు వేయించుకుంటున్న వారికి మాత్రం రూ.250 నుంచి రూ.275 వరకు వేతనం లభిస్తోంది. పని చేసిన వారికి మాత్రమే అంతంత మాత్రం వేతనం లభిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధి పనులు చేసే వారిలో 20 శాతం మందికి రూ.100 లోపే వేతనాలు లభిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment