నిందితుల అరెస్టుపై టీడీపీ నేతల హంగామా
డోన్: దలితులపై దాడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిసి టీడీపీ నేతలు హంగామా సృష్టించారు. ఒకానొక దశలో నిందితులకు కొమ్ము కాస్తూ ధర్నాకు తరలిరావాలని కార్యకర్తలకు మెసేజ్‌లు పంపారు. పోలీసు ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో డోన్ పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు.. గత ఫిబ్రవరి 14న ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో శ్రీరాముల ప్రతిష్ట సందర్భంగా దైవదర్శనానికి వచ్చిన గ్రామ దళితులపై అకారణంగా అగ్రవర్ణాలు దాడిచేసిన సంగతి తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ బుధవారం పోలీసు అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ హంగామా సృష్టించేందుకు యత్నించారు. కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ సీమ సుధాకర్‌రెడ్డి, అతని కుమారుడు సీమ సుబ్బారెడ్డి, డోన్ వీఆర్‌ఓ మల్లారెడ్డి, టీడీపీ నాయకులు ఏకాంతరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మనోహర్ రెడ్డిలు గత ఫిబ్రవరి 13న లక్ష్మణరావు, నాగార్జున, శివ, నాగచంద్రుడు, జక్కలయ్యలను కులం పేరుతో దూషించి మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. నిందితులను ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే రాజకీయ రంగు పులుముతారనే ఉద్దేశంతో పోలీసులు ఓపిక పట్టారు. పోలింగ్ ముగిసిన వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుధవారం ఉదయం డీఎస్పీ కార్యాలయం ముట్టడికి తరలిరావాలని టీడీపీ కార్యాలయం నుంచి కార్యకర్తలకు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. దీంతో డీఎస్పీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, మరోవైపు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సుజాతమ్మ ఇంటి వద్దకు పోలీసులు చేరుకొని ఆమెను గంటపాటు గృహనిర్బంధంలో ఉంచారు. అనంతరం పాత కేసులో అరెస్టు చేశామని, ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలు లాంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో ఆమె మిన్నకుండిపోయారు.
ధర్నాకు తరలిరావాలని టీడీపీ
కార్యాలయం నుంచి కార్యకర్తలకు వాట్సాప్ మెసేజ్‌లు
పోలీసుల ముందస్తు చర్యలతో
పారని టీడీపీ కుట్రలు
Comments
Please login to add a commentAdd a comment