బరితెగించిన టీడీపీ నాయకులు | Sakshi
Sakshi News home page

బరితెగించిన టీడీపీ నాయకులు

Published Thu, May 16 2024 3:05 PM

బరితె

కృష్ణగిరి: టీడీపీ నాయకులు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మద్దతుదారులపై దాడులకు తెగబడుతూ ప్రశాంత గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామంలో గుడిసెలు కూల్చివేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చుంచుఎర్రగుడికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏడుగురు గ్రామానికి ఆనుకుని ఉన్న 338 సర్వే నెంబర్‌ స్థలాన్ని రిజిస్టర్‌ చేయించుకుని అందులో కొట్టాలను వేసుకునేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్‌ ఆ స్థలం తనదని అడ్డుకున్నాడు. ఈ విషయంలో ఇరువురు కోర్టుకు వెళ్లగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అనుకూలంగా కోర్టు తీర్చు ఇచ్చింది. దీంతో నెల రోజుల నుంచి తలారి రామాంజినమ్మ, సులోచనమ్మ, ఉసేన్‌బీ, శిరోల్ల రామలింగడు, మహేశ్వరి తదితరులు స్థలంలో బండలు పాతి గుడిసెలు వేసుకున్నారు.దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకుడు ప్రకాష్‌గౌడ్‌ బుధవారం ఏకంగా డోన్‌ నుంచి దాదాపుగా 40 మందిని పిలిపించి వారికి మద్యం తాపించి దాడులకు తెగబడ్డాడు. రెండు జేసీబీలతో ముందుగా గుడిసెలను నేలమట్టం చేయించాడు. అడ్డుకునేందుకు వెళ్లిన బాధితుల కళ్లలో కారం చల్లి కట్టెలు, రాళ్లతో దాడులు చేయించాడు. ఈ ఘటనలో తలారి శ్రీను, వెంకటస్వామి, జనార్దన్‌, సులోచనమ్మ, రామాంజినమ్మ గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108లో వెల్దుర్తి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు తీవ్ర గాయాలైన తలారి శ్రీను, రామాంజినమ్మ, జనార్దన్‌ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, వెల్దుర్తి సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే, తప్పు చేసిన వారిని కాదని అక్కడికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మీకాంతరెడ్డి, కార్యకర్తలనే దుర్భాషలాడటం చూస్తే పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యను పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

హత్యాయత్నం కేసు నమోదు

సంఘటనా స్థలంలో డోన్‌ నుంచి వచ్చిన వారు కనిపించడంతో పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే, వారిని కేసులో నుంచి తప్పించేందుకు ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు పెట్టలేదు. ఫిర్యాదులో వారి పేర్లు తొలగించాలని బాధితులపై ఒత్తిడి సైతం తెచ్చినట్లు సమాచారం. బాధితుడు బాల వెంకటరాముడు ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈడిగ జయప్రకాష్‌నారాయణ్‌ (వురఫ్‌) ప్రకాష్‌గౌడ్‌, అతని భార్య ఉదయజ్యోతి, కుమారుడు సన్నగౌడ్‌, తిలక్‌కుమార్‌గౌడ్‌, లోకేష్‌గౌడ్‌, శేఖర్‌తోపాటు మరి కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

చుంచు ఎర్రగుడిలో వైఎస్సార్‌సీపీ

కార్యకర్తలపై హత్యాయత్నం

కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కట్టెలతో దాడి

జేసీబీలతో నూతన కొట్టాలు కూల్చివేత

ఐదుగురికి గాయాలు

హత్యాయత్నం కేసు నమోదు చేసిన

పోలీసులు

బరితెగించిన టీడీపీ నాయకులు
1/1

బరితెగించిన టీడీపీ నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement