లక్ష్యం నీరుగార్చి.. నిధులు కొల్లగొట్టి!
● గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచేసిన తమ్ముళ్లు ● విజిలెన్స్ విచారణ చేయించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ● తనిఖీల్లో భారీగా అవినీతి జరిగినట్లు వెల్లడి ● డోన్ కేంద్రంగా ఇంజినీర్ల సంతకాలు ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్ల తయారీ ● ఇంజినీర్ల ఫిర్యాదుతో జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసిన ఎస్‌ఈ ● విచారణ అధికారిగా ఎస్‌ఈకి బాధ్యతలు
కర్నూలు సిటీ: భూగర్భ జలాల పరిరక్షణ కోసమంటూ 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన నీరు–చెట్టు పథకం తెలుగు తమ్ముళ్లకు ఆదాయ వనరుగా మారింది. 2019 ఎన్నికల ముందు వరకు పనులకు అడ్డగోలుగా అనుమతులిచ్చి కొందరు అధికారులతో కలిసి.. టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయించింది. విజిలెన్స్ అధికారులు ర్యాండంగా చేసిన పనులను తనిఖీలు చేయగా భారీగా అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. తనిఖీ చేసిన పనుల్లో రూ.14.72 కోట్ల రికవరీతోపాటు, జల వన రుల శాఖకు చెందిన 8 మంది ఇంజినీర్లపై చార్జెస్ నమోదు చేశారు. నీరు–చెట్టు పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని హైకోర్టులో తెలుగుదేశం పార్టీ కేసులు వేయించింది. ఇదే అదునుగా భావించిన ఆ పార్టీ కార్యకర్తలు చేసిన పనులతోపాటు చేయని పనులకు సైతం బిల్లులు పెట్టారు. కోర్టు ఆదేశాలతో కంటెమ్ట్ ఆఫ్ కోర్టు అయిన వాటికి బిల్లులు చెల్లింపులో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమయంలో చేయని పనులకు బిల్లులు చేయాలని కోర్టుకు వెళ్లి డబ్యూ.పీ నెంబర్లు తెచ్చుకున్నారు. దీనికి కౌంటర్ వేసే సమయంలో అసలు ఆ పనులే చేయలేదని బట్టబయలైంది. తాము క్లోజ్ చేసిప పనులకు బిల్లులు చేయలేదని తమ సంతకాలు ఫోర్జరీ చేశారని, నాణ్యతకు సంబంధించిన సరిఫికెట్లు సైతం తప్పుడు పత్రాలు సృష్టించారని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేని వాటిపై విచారణ చేయించాలని చిన్న నీటిపారుదల శాఖ ఆదోని సబ్ డివిజన్‌లోని ఇంజినీర్లు జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి లేఖ రాశారు. కాగా విచారణ అధికారిగా చార్జెస్ నమోదైన ఎనిమిది మందిలో ఒకరైన ఎస్‌ఈనే నియమించడం ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోతుంది.
చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు డివిజన్ ఆఫీస్ కేంద్రంగానే కుట్ర..!
నీరు–చెట్టు పథకం కింద పూర్తి చేసిన పనులతో పాటు, అగ్రిమెంట్ చేసుకోని, చేపట్టని పనులను ఎంపిక చేసుకొని ఆ పనికి సంబంధించిన ఇంజినీర్ల సంతకాలను డోన్ ప్రాంతంలో ఫోర్జరీ సంతకా లు చేసే ముఠా ద్వారా చేయించి బిల్లులు పెట్టినట్లు విమర్శలున్నాయి. కరోనా సమయంలో చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు డివిజన్ కార్యాలయంలోనే దొంగబిల్లుల ఆలోచనకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ బిల్లులకు సంబంధించిన ఎం.బుక్‌లను ఓ ప్రైవేట్ ప్రింటింగ్ వద్ద ముద్ర వేయించుకుని ఓ ఈఈ, టీడీపీకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లతో కలిసి కోట్లాది రూపాయల స్వాహా కు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. 2019లోనే ఓర్వకల్లు మండంలోని ఓ వర్క్‌ను ఆ టీడీపీ కాంట్రాక్టర్ల పేరుతో తప్పుడు పత్రాలు పుట్టించి, డోన్ సబ్ డివిజన్ ఇంజినీర్లతో సంతకాలు చేయించిన ట్లు అప్పటి ఎస్‌ఈ దృష్టికి వెళ్లగా వెంటనే చేసిన వాటిని రద్దు చేశారు. ఆ తర్వాతే ఆదోని డివిజన్ పరిధిలోని ఆలూరు,ఆస్పరి, హాలహర్వి, ఆదోని మండలాల్లోని పనులకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించి డ బ్ల్యూ.పీ నెంబర్లు పొంది, కౌంటర్ వేసే సమయంలో కుట్ర బయట పడింది. ఇందులో ఇద్దరు ఈఈలు, ఓ డీఈఈ, ఒక ఏఈఈ ఉన్నట్లు తెలుస్తోంది.
కమిటీల పేరుతో రూ.కోట్లు కొట్టేశారు..
జల సంరక్షణ కోసం చేపట్టిన నీరు–చెట్టు పథకం కింద ఉమ్మడి జిల్లాలో 13,806 పనులు, 1,366.43 కోట్ల విలువైన వాటికి అనుమతులు ఇచ్చారు. ఇందులో రూ.1,265.69 కోట్ల పనులు చేపట్టగా.. సుమారు రూ.580 కోట్ల పనులు పూర్తయ్యాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌ల్లో, వాగుల్లో పేరుకుపోయిన పూడిక తీసి, ఆ పూడిక మట్టిని రైతుల పొలాలకు ఉచితంగా తరలించి సారవంతం చేయాలనేది లక్ష్యం. జన్మభూమి కమిటీల ఆమోదంతో పనులు చేయాల్సి ఉన్నా..ఆ కమిటీ ముసుగులో మాఫియాగా మారిన తమ్ముళ్లు ప్రజా ధనాన్ని లూటీ చేశారు. నిబంధనలకు విదరుద్ధంగా చేయలేమని కొందరు ఇంజినీర్లు అభ్యంతరం చెప్పినా.. అప్పటి జిల్లా కలెక్టర్ ద్వారా ఒత్తిళ్లు తెచ్చి మరీ పనులు చేయించుకున్నారు. 2019లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో ర్యాండమ్‌గా జిల్లాలో రూ.23.22 కోట్ల విలువైన 233 పనులను చేయగా, 161 పనుల్లో చేసిన పనికి, రికార్డు చేసిన పనుల విలువకు తేడాలు ఉన్నట్లు, 72 పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు బయటపెట్టారు. మరో రూ.11 కోట్లు స్వాహా చేసినట్లు నిర్ధారించి మొత్తం రూ.14.71 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment