ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
● ఆర్‌యూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్
కర్నూలు(కల్చరల్): విద్యార్థులు ర్యాగింగ్ జోలికెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ అన్నారు. మంగళవారం వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్ హాల్‌లో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆర్‌యూ ప్రాంగణంలో ర్యాగింగ్‌కు ఏ మాత్రం స్థానం ఉండకూడదన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను విద్యా సంస్థల్లో చేరుస్తారని ర్యాగింగ్ లాంటి అనవసర విషయాల్లో తలదూర్జి జీవితాలను పాడు చేసుకోవద్దని హితువు పలికారు. క్యాంపస్‌లో జూనియర్, సీనియర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని ఆకాక్షించారు. కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ మాట్లాడుతూ ర్యాగింగ్ ఏ రూపంలో ఉన్నా అది శిక్షార్హమైన నేరమన్నారు. విద్యార్థులు ర్యాగింగ్, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాద్‌రెడ్డి, సీఐ ఎం. శ్రీధర్, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఓపీ నెం.41లో
సదరం క్యాంపు
కర్నూలు(హాస్పిటల్): రోగులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఇకపై కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సదరం క్యాంపు (ఓపీ నెం.41)లో నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి బుధవారం ఽఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ధన్వంతరి హాలులో నిర్వహించే మెడికల్ బోర్డును సదరం క్యాంపు ఓపీ నెం.41లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇకపై ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ (ఆరోగ్య పింఛన్లు) మెడికల్ బోర్డు వారు సదరం క్యాంపునకు వెళ్లాలని సూచించారు. అక్కడే వైద్యులు పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు.
4,830 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 4,830 క్వింటాళ్లు కేటాయించింది. ఇందులో పత్తికొండ సబ్ డివిజన్‌కు అత్యధికంగా 2,960 క్వింటాళ్ల వేరుశనగను జిల్లా యంత్రాంగం మంజూరు చేసింది. కర్నూలు సబ్ డివిజన్‌కు 680 క్వింటాళ్లు, ఆదోనికి 450, ఎమ్మిగనూరుకు 210, ఆలూరు సబ్ డివిజన్‌కు 530 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనం కాయలను ప్రభుత్వం అందజేస్తుంది.
తగ్గుతున్న నీటి మట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలండ్యాం నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ జూరాల, సుంకేసు ల నుంచి నీటి విడుదల పూర్తిగా నిలిచి పోయింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 4,350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,496 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. జలాశయంలో 169.8650 టీఎంసీల నీరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment