విహారయాత్రకు వెళ్లి మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

విహారయాత్రకు వెళ్లి మృత్యువాత

Published Mon, Nov 25 2024 7:45 AM | Last Updated on Mon, Nov 25 2024 7:45 AM

విహార

విహారయాత్రకు వెళ్లి మృత్యువాత

ఆళ్లగడ్డ: విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి కొంతమంది ప్రైవేటు టూరిస్టు బస్సు తీసుకొని వారణాసి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. ఈ ప్రయాణంలో కౌశ్యాంబి వద్ద బస్సు బోల్తా పడ్డ ఘటనలో బత్తలూరు గ్రామానికి చెందిన శేషయ్య (65) అనే వ్యక్తి మృతి చెందాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

పోగొట్టుకున్న సొమ్ము

బాధితులకు అప్పగింత

కర్నూలు (టౌన్‌): పోగొట్టుకున్న సొమ్మును నాలుగవ పట్టణ పోలీసులు వెతికిపెట్టి బాధితులకు అప్పగించారు. ఈ వివరాలను ఆదివారం నాలుగవ పట్టణ సీఐ మధుసూదన్‌ గౌడ్‌ వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన కాత రామిరెడ్డి, దంపతులు కర్నూలు నగరంలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి సున్నిపెంటకు వెళ్లేందుకు కర్నూలు బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. వారి బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. బ్యాగ్‌లో 6 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.12 వేలు నగదు ఉండటంతో బాధితులు నాలుగవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి మూడు రోజుల్లో బ్యాగ్‌ను గుర్తించారు. బాధితులను ఆదివారం స్టేషన్‌కు పిలిపించి సొమ్ము అప్పగించినట్లు సీఐ వెల్లడించారు.

ఆటో బోల్తాపడి మహిళ మృతి

ఆదోని అర్బన్‌: ఆదోని పట్టణంలోని భీమాస్‌ సర్కిల్‌ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన మహంకాళమ్మ (50) మృతిచెందింది. మృతురాలి బంధువులు ట్రాఫిక్‌ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడబూరు మండలం తారాపురంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఆదోని భీమాస్‌ సర్కిల్‌లో ఆటో వేగంగా వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. మహంకాళమ్మ తీవ్రంగా గాయపడడంతో బోల్తా పడిన ఆటోను లేపి అదే ఆటోలో స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

పత్రికా విలేకరిపై ఫిర్యాదు

ఆదోని అర్బన్‌: తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ పత్రికలో ప్రచురించిన ఓ పత్రికా విలేకరిపై కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రాష్ట్ర మాజీ ఫుడ్‌ కార్పొరేషన్‌ మెంబర్‌ గుడిసె క్రిష్ణమ్మ ఆదివారం రాత్రి డీఎస్పీ సోమన్నకు ఫిర్యాదు చేశారు. వెంటనే విలేకరిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రూ. 40 వేలు మామూలు ఇవ్వలేదనే కారణంతోనే తనపై ఆరోపణలు చేస్తూ పదేపదే పత్రికల్లో కథనాలు ప్రచురించి తన పరువుకు భగంగం కలిగించిన విలేకరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు డీఎస్పీ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని త్రీ టౌన్‌ సీఐ రామలింగయ్యను ఆదేశించారు.

కరెంట్‌షాక్‌తో

పాడిగేదె మృతి

కోడుమూరు రూరల్‌: గూడూరు మండలం చనుగొండ్లలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలి ఆదివారం ఓ పాడి గేదె మృతి చెందింది. రైతు దస్తగిరి మేతకోసం గేదెలను తీసుకుని పొలాల వైపు వెళ్లాడు. రైతు మల్లారెడ్డి పొలం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫారాన్ని ప్రమాదవశాత్తు గేదె తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. జీవనాధరమైన రూ.70వేలు విలువగల పాడి గేదె మృతితో రైతు దస్తగిరి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
విహారయాత్రకు వెళ్లి మృత్యువాత 1
1/1

విహారయాత్రకు వెళ్లి మృత్యువాత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement