వెల్లివిరిసిన ఆత్మీయత
బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం
ఎమ్మిగనూరురూరల్: ఎన్డీఏ కూటమి బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. భక్త కనకదాసు జయంతి పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని గ్లోబల్ ఇండస్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో బైక్‌పై ర్యాలీ నిర్వహించారు. కురవ సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(అర్బన్): కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆయా కులబాంధవుల ఆధ్వర్యంలో వన భోజనాల సందడి నెలకొంది. బంధువులు, స్నేహితులతో కలిసి వన భోజన కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. ఈ నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలు, పలు దేవాలయాలు, ఇతర ప్రదేశాలు సందడిగా మారాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉత్సాహం హోరెత్తింది.
నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ...
నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక హరి హర క్షేత్రం శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం, భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక వనభోజనం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ అధ్యక్షతన ముందుగా ధాత్రి (ఉసిరి చెట్టుకు) విశేష పూజలు నిర్వహించారు. వైద్య శిబిరంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
కురువ సంఘం ఆధ్వర్యంలో ...
నగర శివారు పెద్దపాడు రోడ్డు బీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో కురువ సంఘం ఆధ్వర్యంలో 22వ కార్తీక వనభోజనాలను ఘనంగా నిర్వహించినట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి తెలిపారు. ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రామకృష్ణ, సిట్రా సత్యనారాయణమ్మ, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, కల్లూరు తహసీల్దార్ కే ఆంజనేయులు, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
కుర్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
కుర్ని (నేసే) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగన్నబావి సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి సంఘం నగర కమిటీ అధ్యక్షుడు గడిగె ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాదుగుండు కృష్ణయ్య హాజరయ్యారు. చిన్నారులు ఆటపాటలతో హోరెత్తించారు.
వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ....
స్థానిక బళ్లారి రోడ్డులోని వెంకట్‌నాయుడు కల్యాణ మండపంలో వాల్మీకి సంఘం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే బీ.విరూపాక్షి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, సంజీవలక్ష్మి, మంజునాథ్, మురళీ, రామకృష్ణ, రామాంజనేయులు, మహేష్‌నాయుడు, తలారి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
బలిజ సంఘం ఆధ్వర్యంలో ...
కర్నూలు(అర్బన్): నగర శివారుల్లోని జి పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వెనుకనున్న విజ్ఞాన పీఠంలో నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. న్యాయ వాది రామచంద్రరావు, పత్తి ఓబులయ్య అతిథులుగా పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.
నేడు వడ్డెరల కార్తీక వనభోజనాలు
కర్నూలు న్యూసిటీ: వడ్డెర కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమం సోమవారం స్థానిక బళ్లారి రోడ్డులోని వై జంక్షన్ సమీపం నాగేంద్రనగర్ వడ్డెర కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్నట్లు లక్ష్మి వేంకటేశ్వర వడ్డెర కుల సంఘం భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డెరలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment