జింక చర్మం అక్రమ రవాణా ముఠా అరెస్ట్
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి.. వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నాగస్వామి.. ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. గుంతకల్లు పట్టణానికి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, ప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాన్ని కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ అధికారులతో కలిసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వారిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్ కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment