సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ పోలీసుశాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓ పోలీసు అధికారి ఏడాదికి పైగా కనిపించడం లేదు. వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించి చివరికి వరంగల్ డీఐజీకి అటాచ్డ్‌లో ఉన్న సదరు అధికారి ఏమయ్యాడనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్లుగా ఉన్న 1996 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్‌పీ)లుగా పదోన్నతి పొందనున్నారు. సుమారు రెండేళ్ల కిందట 1995 బ్యాచ్‌కు సంబంధించిన పదోన్నతుల జాబితా వెలువడే సమయంలో 1996 బ్యాచ్‌కు చెందిన కొందరు కోర్టుకు వెళ్లడం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి బ్రేక్ పడింది. ఇందులో మల్టీజోన్–1 చెందిన వారు 38 మంది ఉన్నారు.
ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఆ జాబితా (1995 బ్యాచ్) క్లియర్ కాగా.. ప్రభుత్వం చొరవతో 1996 బ్యాచ్‌కు చెందిన వారికి కూడ డీఎస్‌పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఇటీవల లైన్ క్లియరైంది. ఇందులో మల్టీజోన్–1లోని 38 జాబితాను కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ జాబితాలోని ఒకరు సర్వీసు నుంచి తొలగించబడగా, ఇద్దరు మృతిచెందారు.
మిగిలిన 35 మందిలో భరత్‌కుమార్ ఏడాదిగా విధులకు హాజరు కావడం లేదని పదోన్నతుల జాబితాలోని రిమార్క్స్‌లో ఐజీ పేర్కొన్నారు. బి.భద్రయ్యగా ఉన్న ఆయన భరత్‌కుమార్‌గా పేరు మార్చుకున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఇంటెలిజెన్స్‌లో పని చేసిన భరత్.. పదోన్నతుల జాబితా వెల్లడి నాటికి ‘ఏడాదికి పైగా విధులకు గైర్హాజర్’గా పేర్కొనడంపై పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఎస్‌ఐగా, సీఐగా పని చేసిన సమయంలో కూడా కొన్ని అంశాల్లో వివాదస్పదం అయ్యాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కాలుపెట్టిన ఆయన డీఎస్‌పీ పదోన్నతుల జాబితా వెలువడే సమయానికి ఎక్కడికెళ్లాడు? ఏం చేస్తున్నాడు? అన్నది చర్చగా మారింది. విధులకు హాజరుకాకుండా.. ఉన్నతాధికారులకు కనిపించకుండా పోయిన ఈ ‘నాలుగోసింహం’ విషయం హాట్‌టాఫిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment