దేవుని గుట్టపై రాతి కట్టడాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం బంధాల అటవీ ప్రాంతంలోని దేవుని గుట్టపై పురాతన రాతి కట్టడాలను గుర్తించినట్లు పరిశోధన బృందం సెంటర్ డైరెక్టర్ కాక నర్సింగారావు, అసోసియేట్ డైరెక్టర్ కొర్నెబెల్లి గణేశ్ తెలిపారు. బంధాల అభయారణ్యంలో దేవుని గుట్టపై పురాతన కోటను బుధవారం కామారం సమ్మక్క, సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ పరిశోధనా బృందం సందర్శించింది. పురాతన కోటలను రాజ్య పాలన ఆనవాళ్లు, పురావస్తు వస్తువులను గుర్తించినట్లు బృందం సభ్యులు వెల్లడించారు. గుట్ట కింద మూడు కిలోమీటర్ల విస్తరణలో గుట్టను ఆనుకుని కోట గడి నిర్మాణం చేశారన్నారు. దీని పరిధిలో పురాతన శివలింగం, నంది నాగుపాము బొమ్మలు, ధ్వంసమైన చిన్న ఆలయం ఉందన్నారు. శిథిలాలలో ఉన్న రాళ్లపై లిపిని అధ్యయనం చేయగా నాలుగు పలకల బండలపై నాలుగో గొట్టును తెలియ చేసే నాలుగు గుర్తులు, రాజ్య ముద్ర దీర్ఘ చతురస్రాకారం బండపై చెక్కారన్నారు. ఇంకొక చిన్న కోట గడిలో ఇప్ప చెట్టు కింద గుర్రం తల పోలిన రాయిపై ఐదు డబ్బాలు సమ్మక్క తల్లి అయిదో గొట్టు అని తెలుపగా ఇంకొక పక్క నాలుగు డబ్బాలు నాలుగు గొట్టు కోడలునీ తెలియ చేస్తుందన్నారు. ఇది సింధు నాగరికతలో మోనో లోగో శిలబిక్ రూపంలో ఒక కొమ్ము దుప్పిని పోలిన ఆకారంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. నాగులమ్మ పడిగా బొమ్మ, నెమలి ఈకలు పెట్టుకున్న మహిళ బొమ్మ గుర్తించామని, రాయిపై ఈ కోట ఎలా ఉందనే విషయంపై మ్యాప్ కూడా గుర్తించామన్నారు. పెద్ద రాళ్ల సాయంతో అయిదు వందల మీటర్ల దీర్ఘ చతురస్రాకారంలో ఈ కోట గడి ఉందన్నారు. దీని లోపల 60 పురాతన రోళ్లను గుర్తించామన్నారు. పురాతన రాజ్యాల ప్రజలు ఇక్కడ వడ్లు దంచేవారన్నారు. ఈ కోటకు నాలుగు పక్కల ద్వారాలు ఉన్నాయన్నారు. నీటి బావి నీటి గోళాలు, ఇంటి స్థలం, వస్తూ సామగ్రి ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపారు. గుట్ట కింద కూడా 98 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పులో రచ్చ బండ ఉందన్నారు. ఇందులో కూర్చోవడానికి 56 రాళ్లు నాలుగు వరుసలుగా ఉన్నాయన్నారు. కానీ గుప్త నిధుల పేరిట నిత్యం పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని గుర్తించామన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి రక్షణకు కృషి చేయాలన్నారు.
గుర్తించిన పరిశోధన బృందం
Comments
Please login to add a commentAdd a comment