రూ.24.45 కోట్లతో కాజీపేట జంక్షన్ అభివృద్ధి
● వివరాలు వెల్లడించిన
దక్షిణ మధ్య రైల్వే అధికారులు
● అమృత్ భారత్ పథకంలో భాగంగా
శరవేగంగా సాగుతున్న పనులు
కాజీపేట రూరల్: 19వ శతాబ్దం నిజాం కాలంలో నిర్మించిన కాజీపేట జంక్షన్‌ను రైల్వేశాఖ అమృత్‌భారత్ స్టేషన్ పథకానికి ఎంపిక చేసి రూ.24.45 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు బుధవారం కాజీపేట జంక్షన్ రీడెవలప్‌మెంట్ పనుల వివరాలను రైల్వే అధికారులు విలేకరులకు వెల్లడించి మాట్లాడారు. భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టే షన్ల పునరాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కాజీపేట జంక్షన్‌లో చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 2023 ఆగస్టు, 2024 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్ రూ.41.36 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 24,269 మంది ప్రయాణికులకు సేవలందిస్తోందని, ఇక్కడ దాదాపు 98 రైళ్లకు హాల్టింగ్ ఉందన్నారు. అన్ని సౌకర్యాలతో ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment