మహబూబ్‌నగర్: వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించిన తర్వాత ఉమ్మడి పాలమూరులో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా అసమ్మతి గళం పెంచుతూ.. తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే తమ ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై స్వతంత్రులుగానో లేదంటే సింహం, ఏనుగు, రెండాకులు వంటి గుర్తుల్లో ఏదో ఒకదానిపై బరిలో నిలిచేలా కసరత్తు చేపట్టారు. దీంతో ఓట్లు చీలి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణ చర్యల్లో భాగంగా అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది. అయినా పలువురు కచ్చితంగా బరిలో నిలుస్తామంటూ తెగేసి చెబుతుండడంతో అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలకు పలు ఆఫర్లు ఇవ్వడం కొత్త ‘ట్విస్ట్’లకు దారి తీసింది. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో చర్చల సందర్భంగా వచ్చిన ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు నాగర్‌కర్నూల్, అటు వనపర్తితో పాటు అభ్యర్థులను ప్రకటించని మిగిలిన స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు, వారి అనుచరులను కలవరానికి గురిచేస్తోంది.
‘నాగం’కు వనపర్తి ఆఫర్..
కాంగ్రెస్ ప్రకటించిన మొదటి విడత టికెట్ల జాబితాలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల పార్టీలో చేరిన యువనేత కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ఈ పరిణామంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తీరుతోపాటు నియోజకవర్గ అభ్యర్థిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దీంతో ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి కలిసి హైదరాబాద్‌లోని నాగం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలో వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నాగంకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. నాగం జనార్దన్‌రెడ్డి స్వగ్రామం సైతం వనపర్తి నియోజకవర్గంలోని రేవల్లి మండలం నాగాపూర్ కావడంతో ఈ ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం.
‘చింతలపల్లి’ దారెటు..
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ దక్కని సీనియర్ నేత జగదీశ్వరరావు తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉండనున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే ఆయనతో భేటీ అయి బుజ్జగించినట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
దీనిపై కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని జగదీశ్వరరావు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం జగదీశ్వర్‌రావుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వారు సైతం ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు వినికిడి. ఇరు పార్టీల నుంచి ఆఫర్ నేపథ్యంలో జగదీశ్వరరావు ఏ నిర్ణయం తీసుకుంటారు.. ఆయన దారెటు అనేది ఆసక్తి రేపుతోంది.
ఇది ఎవరి మాట !
వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున నాగం జనార్దన్‌రెడ్డిని బరిలో నిలపాలన్న అనూహ్య ప్రతిపాదన పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ స్థానం కోసం మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డితోపాటు కొన్ని నెలల క్రితం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేఘారెడ్డి సైతం పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి సమక్షంలో జరిగిన భేటీలో వనపర్తి నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానమే చేసిందా, లేక ఓ వర్గాన్ని కట్టడి చేసేందుకు చిన్నారెడ్డినే ప్రతిపాదన తెచ్చారా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనపై నాగం మనసులో ఏముందనే ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ఆయన ఒప్పుకుంటారా.. తిరస్కరిస్తారా.. నాగర్‌కర్నూల్ నుంచే స్వతంత్రంగా బరిలో నిలుస్తారా.. అనేదానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
మిగతా 6 స్థానాల్లో కొన్నింట మార్పులు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉనాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో ఎనిమిది స్థానాల్లో (నాగర్‌కర్నూల్ – రాజేష్ రెడ్డి, కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు, గద్వాల – సరితా తిరుపతయ్య, అచ్చంపేట – చిక్కుడు వంశీకష్ణ, అలంపూర్ – సంపత్, షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి, కొడంగల్ – రేవంత్ రెడ్డి) అభ్యర్థులను ప్రకటించారు.
మిగిలిన ఆరు స్థానాల్లో (జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్) అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ తరహాలోనే అసమ్మతుల బెడద నెలకొనడంతో కీలక నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా పాలమూరులో హస్తం టికెట్ల లొల్లి ‘హస్తిన’కు చేరగా.. జాతీయస్థాయి ముఖ్య నేతలు పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది.
స్థానికత, సామాజిక వర్గం, ఆయా అభ్యర్థుల వ్యవహారశైలి తదితర అంశాలతో పాటు వెల్లువెత్తే అసమ్మతిపై పూర్తిస్థాయి అంచనాకు వచ్చిన పెద్దలు ఇది వరకు ఖరారు చేసిన జాబితాలో స్వల్ప మార్పులు చేసినట్లు పారీ్టలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నారాయణపేట, మక్తల్, దేవరకద్రలో మార్పులుంటాయనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
ఇది చదవండి: "14 ఏళ్ల తర్వాత సొంత గూటికి వెళ్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి"
Comments
Please login to add a commentAdd a comment