పార్లమెంట్‌ ఎన్నికలు బహిష్కరిస్తాం.. | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికలు బహిష్కరిస్తాం..

Published Mon, May 6 2024 2:40 AM

పార్లమెంట్‌ ఎన్నికలు బహిష్కరిస్తాం..

మహబూబ్‌నగర్‌ రూరల్‌: కాలుష్య కారకమైన అమరరాజా బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు నిరసనగా మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు (ఎదిర) ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల ఓటింగ్‌ బహిష్కరణకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుమారు 56 రోజులపాటు అమరరాజా బ్యాటరీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసినా ఎవరూ స్పందించకపోవడంతో విసిగివేసారిన వార్డు ప్రజలు పార్టీలకు అతీతంగా ఎన్నికల బహిష్కరణకు ఆదివారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమర రాజా పరిశ్రమ వ్యతిరేక కమిటీ ప్రతినిధులైన వార్డు కౌన్సిలర్‌ యాదమ్మ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, మొగిలి నర్సింహులు మాట్లాడుతూ అమరరాజా బ్యాటరీ కంపెనీ కాలుష్య కారకమైనదని, ఆ కంపెనీ ఏర్పాటు చేయడం వార్డు ప్రజలకు ఇష్టం లేదన్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోకపోవడం వల్లే ఓటింగ్‌ బహిష్కరణకు నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో పాల్గొనబోమని, అంతేకాక తమ వారసుల భవిష్యత్‌ కోసం చుట్టుపక్కల గ్రామాల వారికి అవగాహన కల్పిస్తామని, వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనకుండా చూస్తామన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ బహిష్కరించిన దివ్యాంగురాలు

ఎదిర వార్డు ప్రజల నిర్ణయం మేరకు దివ్యాంగురాలు వసంత పార్లమెంట్‌ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును బహిష్కరించింది. ఓటు ఫర్‌ హోం కార్యక్రమంలో ఆదివారం ఓటు వేయమని ఆమె వద్దకు వచ్చిన ఎన్నికల సిబ్బందికి తాను ఓటు వేయనని తేల్చి చెప్పింది. వార్డు ప్రజలందరూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, వారు ఓటింగ్‌ బహిష్కరణకు తీర్మానం చేసినందుకు తాను కూడా ఓటు వేయనని చెప్పారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాసులు, నర్సింహులు, మోహన్‌కుమార్‌, రవికుమార్‌, రాఘవేందర్‌, శివకుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరరాజా బ్యాటరీ కంపెనీ

ఏర్పాటుపై ఎదిర వాసుల నిర్ణయం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement