జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో రోజు రోజుకు భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు సైతం ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడం లేదు. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయి. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1046 పాఠశాలలుండగా 1,15,324 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీపీ, జెడ్పీపీ 683 పాఠశాలల్లో 37,207 మంది, 30 ప్రభుత్వ పాఠశాలల్లో 2648 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 15 నుంచి 20వరకు నమోదైనట్లు తెలుస్తోంది. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం రెండంకెలు కూడా దాటని పరిస్థితి. ప్రతీరోజు వసతిగృహలతో కూడిన విద్యాలయాల ప్రిన్సిపాల్, ఎస్‌వోలు పిల్లలకు ఫోన్ చేసి రమ్మని చెబుతున్నా ఎండలు తగ్గాక వస్తామంటూ దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి రావడంతో కొందరు విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు వచ్చిన విద్యార్థి మరో రోజు రావటం లేదని తెలుస్తోంది. ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున పుస్తకాలు అందించనుండడంతో పుస్తకాలు లేకుండానే పాఠాలు సాగుతున్నాయి.
వసతి గృహాల్లో..
వసతితో కూడిన విద్యాలయాల్లో మరోలా ఉంది. తొమ్మిది టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లలో 2605 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ స్కూల్‌లో 581మంది, 16 టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్ ఆశ్రమ పాఠశాలల్లో 2668 మంది, అర్బన్ రెసిడెన్షియల్‌లో 88 మంది, 18 కేజీబీవీల్లో 4405 మంది అభ్యసిస్తున్నారు. ఐదు మోడల్‌స్కూళ్లలో 3,399, ఎనిమిది ఎంజేపీటీబీసీసీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్ స్కూళ్లలో 3342 మంది చదువుతున్నారు. నాలుగురోజుల గడుస్తున్నా పట్టుమని పదిమంది కూడా రాని పరిస్థితి. వాతావరణం చల్లబడే వరకై నా పాఠశాలలు వేళలు మార్చడం.. ఒంటిపూట బడులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఒంటిపూట పెడితే బాగుంటుంది..
ఎండలు బాగా ఉన్నా యి.. ఇంట్లోనే కూలర్ తిరుగుతుంటే తట్టుకో లేకపోతున్నాం. బడిలో పిల్లలు ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ ఉన్నా వడగాల్పులతో ఇబ్బందిగా ఉంది. అందుకే మా బాబును మధ్యాహ్నం వచ్చి ఇంటికి తీసుకెళ్తున్నా. ఒక్కపూట బడిపెడితే మంచిగుండు.. చల్లబడే వరకు రెండు పూటలకు పంపాలంటే భయంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment