చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వెళ్లే దారి ఇదీ..
చెన్నూర్: జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వానొస్తే బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు మురికి నీరంతా రోడ్లపై పారుతోంది. చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారి పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైపు మట్టి రోడ్డు ఉంది. వర్షం పడినప్పుడు బురదగా మారుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్ కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు పూర్తి కాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
ఎన్‌పీవాడ, దుబ్బాగూడెంలకు వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షపు నీరు నిలిచి నడక నరకప్రాయంగా మారింది. గాంధీచౌక్ నుంచి పద్మశాలి వీధికి వేళ్లే రోడ్డు మధ్యలో నీరు నిలుస్తోంది. పెద్దగూడెం, మారెమ్మవాడలలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాలకు బురదమయంగా మారుతున్న రోడ్లను గుర్తించి అధికారులు కొత్త రోడ్ల నిర్మాణాలకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment