ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించాలి | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించాలి

Published Wed, May 8 2024 11:50 PM

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ను గెలిపించాలి

● బీజేపీ పాలనలో పెరిగిన అసమానతలు ● టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

బెల్లంపల్లి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రడగంబాల బస్తీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలనలో దేశంలో అసమానతలు పెరిగాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో 50 మంది బిలియనీర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 162 మందికి చేరిందని ఆరోపించారు. బిలినీయర్ల ఆస్తులు గణనీయంగా పెరగగా ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయని పేర్కొన్నారు. 25 వేల కోట్లు ఉన్న ఆదానీ ఆస్తులు బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఏడున్నర లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. పెట్రోలియం ఉత్పత్తులు, జీఎస్టీ పేరుతో దేశ ప్రజలపై రూ.58 వేల కోట్ల పన్నుల భారాన్ని మోపిందని విమర్శించారు. రైతుల పంట రుణాలు మాఫీ చేయలేదని, నిరుద్యోగం 2శాతం నుంచి 8శాతానికి ఎగబాకగా ప్రతీ ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినోద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మునిమంద రమేష్‌, దావ రమేష్‌, ఎం.మల్లయ్య, ప్రభాకర్‌, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాబన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement