● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్‌ కానున్న ఎన్నికల ప్రచార మోత | Sakshi
Sakshi News home page

● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్‌ కానున్న ఎన్నికల ప్రచార మోత

Published Sat, May 11 2024 12:40 AM

● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్‌ కానున్న ఎన్ని

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4గంటలకు పరిసమాప్తం కానుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌కు 48గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. దీంతో చివరి రోజు అభ్యర్థులు ప్రతీ నిమిషాన్ని వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. గత నెల 29న నామినేషన్ల పక్రియ పూర్తయినప్పటి నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తీరిక లేకుండా ప్రచారంలోనే గడిపేస్తున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు పోటాపోటీగా ప్రజల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎండ, వానలోనూ పట్టణాల నుంచి మారుమూల గ్రామాల దాకా పర్యటించారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వాడీవేడిగా ప్రచారం సాగించారు. ప్రచార సమయంలో అభ్యర్థులు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఓట్లు కొల్లగొట్టేందుకు దూకుడుగా వెళ్తున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో బహిరంగ సభలు, బైక్‌ ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల అభ్యర్థులు అభివృద్ధి లోటుపాట్లు, గెలిపిస్తే హామీలు కురిపించారు. అధికారంలో ఉన్న నాయకులు తాము చేసిన, చేస్తున్న పథకాలు, చేయబోయే కార్యక్రమాలు వివరించారు.

సీఎం సభ లేనట్లే..

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కీలకంగా ఉన్న మంచిర్యాల జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావించారు. ప్రచార గడువు శనివారంతో ముగియనుండగా సీఎం సభ లేకుండా పోయింది. అంతేగాక కాంగ్రెస్‌ అగ్ర నాయకులెవరూ జిల్లాలో ప్రచార సభ నిర్వహించలేదు. జిల్లా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ ముఖ్య అతిథిగా పట్టణ స్థాయి బహిరంగ సభ జరిగింది. అంతకుమించి ముఖ్య నాయకులెవరూ రాలేదు. బీజేపీ నుంచి ప్రచారం కేవలం స్థానిక నాయకులతోనే ముగించారు. బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ పార్టీ ఇన్‌చార్జి మురళీధర్‌రావు మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు మించి జిల్లాలో రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్య నాయకులు, క్యాంపెయిన్‌ స్టార్లు ప్రచారంలో పాల్గొనలేదు. దీనిపై బీజేపీ కేడర్‌లోనే నారాజ్‌ ఉంది. రాష్ట్రంలోని పలు పార్లమెంటు స్థానాల్లో హోరాహోరీగా ఉన్న చోట్ల కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్టార్‌ క్యాంపెయినర్లు పర్యటించారు. పొరుగున పెద్దపల్లి జిల్లాలోనూ నాయకులు వచ్చినా జిల్లాకు రాలేదు. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జిల్లా కేంద్రంలో బస్సు యాత్రలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు. కేసీఆర్‌ రాకతో ఆ పార్టీ నాయకుల్లో జోష్‌ నింపింది. అంతేకాక చివరి రోజున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తో చెన్నూరులో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టారు. ఈ సభను సక్సెస్‌ చేసేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement